Breaking News: డ్యూటీలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర సీఐ, ఎస్‌ఐ..

కీసర, సెప్టెంబర్ 17 (ఈ క్షణం): మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ అధికారులు భారీ ఆపరేషన్‌ నిర్వహించారు. పీడీఎస్‌ (రేషన్‌) బియ్యం కేసులో నిందితుడికి స్టేషన్‌ బెయిల్‌ ఇప్పించేందుకు లంచం డిమాండ్‌ చేసిన ఆరోపణలపై కీసర సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. నిందితుడి నుంచి మిగిలిన రూ.5 లక్షలు లంచంగా తీసుకుంటుండగా ఎస్‌ఐను ఏసీబీ(ACB) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

పది క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం కేసులో నిందితుడికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు సీఐ ఆంజనేయులు రూ.10 లక్షలు లంచం డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. చివరకు బాధితుడితో రూ.8.35 లక్షల నుంచి రూ.8.50 లక్షల వరకు ఒప్పందం కుదిరినట్లు, ఈ మొత్తంలో ఇప్పటికే సెప్టెంబర్‌ 2న రూ.3.50 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. మిగిలిన రూ.5 లక్షలు తీసుకునే సమయంలో ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు.

ఏసీబీ సూచనల మేరకు బాధితుడు లంచం మొత్తాన్ని అందించేందుకు సిద్ధమయ్యాడు. కీసర పెద్దమ్మ చెరువు సమీపంలో నిమజ్జనం డ్యూటీలో ఉన్న ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి వద్దకు బాధితుడు చేరుకున్నాడు. రూ.5 లక్షలు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకుని దాడి చేశారు. ఏసీబీ అధికారులను గమనించిన ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి అక్కడి నుంచి పరుగులు తీసేందుకు ప్రయత్నించారు. అనంతరం అధికారులు ఆయనను వెంటాడి పట్టుకున్నారు.

లంచం కేసులో పట్టుబడిన సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి కెమికల్ పరీక్షలకు సహకరించకుండా ఏసీబీ అధికారులను ముప్పుతిప్పలు పెట్టినట్లు అధికారులు తెలిపారు. లంచం స్వీకరణను నిర్ధారించేందుకు నిర్వహించే తదుపరి ప్రక్రియలో అధికారుల సహకారం లేకపోవడంతో చర్యలకు కొంత సమయం పట్టినట్లు సమాచారం.

లంచం డిమాండ్‌ చేయడంతో పాటు పీడీఎస్‌ బియ్యం కేసులోని నిందితుడితో వ్యక్తిగత పనులు కూడా చేయించుకున్నట్లు సీఐ ఆంజనేయులుపై ఆరోపణలు ఉన్నాయి. కొంతకాలంగా నిందితుడిని ఇబ్బందులకు గురిచేస్తూ, బిర్యానీలు, కూల్‌డ్రింక్స్‌ తీసుకురావాలని కూడా ఆదేశించేవారని సమాచారం. ఈ వేధింపులతో విసిగిపోయిన బాధితుడు చివరకు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు సమాచారం.

ఏసీబీ అధికారులు లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకుని సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డిని అరెస్టు చేసినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. వారిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనతో కీసర పోలీస్‌స్టేషన్‌లో అవినీతి ఆరోపణలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఏసీబీ దర్యాప్తులో లంచం డిమాండ్‌ నుంచి నగదు స్వీకరణ వరకు వెలుగులోకి వచ్చే వివరాల ఆధారంగా తదుపరి చర్యలు ఉండనున్నాయి.

Leave a Reply