Breaking News: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం కీలక చర్చలు.. PRC, CPS, DAపై కీలక నిర్ణయాలు

హైదరాబాద్, క్షణం: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న పలు కీలక అంశాలపై ప్రభుత్వం–TGEJAC మధ్య చర్చలు జరిగాయి. ప్రధానంగా పే రివిజన్ కమిషన్ (PRC) నివేదిక, CPS రద్దు–OPS పునరుద్ధరణ, పెండింగ్ DAలు, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, హెల్త్ కార్డు అమలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు TGEJAC వర్గాలు వెల్లడించాయి.

ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో ఒకటైన PRC ప్రక్రియపై సమావేశంలో కీలక చర్చ జరిగింది. నెల 18తేదీలోపు PRC కమిటీ తన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)కి సమర్పించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.

PRC కమిటీ నివేదిక సమర్పణకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినట్లు ఉద్యోగ సంఘాల వర్గాలు తెలిపాయి. దీంతో చాలాకాలంగా PRC కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల్లో ఆశలు పెరిగాయి.

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) రద్దు అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది. CPSపై సమగ్ర అధ్యయనం చేసి, ఉద్యోగుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకునేలా అధ్యయన కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించినట్లు తెలుస్తోంది.

CPS స్థానంలో పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్ధరించాలన్న తమ డిమాండ్‌ను TGEJAC ప్రతినిధులు స్పష్టంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏ (Dearness Allowance) అంశంపైనా కీలక చర్చ జరిగింది. ఈ నెల 18వ తేదీన జరిగే సమావేశంలో పెండింగ్ DAలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని నిర్ణయించినట్లు ఉద్యోగ సంఘాల వర్గాలు తెలిపాయి.

ఎన్నో నెలలుగా పెండింగ్‌లో ఉన్న DA బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.

ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లుల బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించాలని TGEJAC ప్రతినిధులు ప్రభుత్వానికి స్పష్టం చేసినట్లు సమాచారం.

TGEJAC సభ్యులు లచ్చిరెడ్డి, వడ్నాల రాజశేఖర్ ఉద్యోగుల ఆర్థిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

ఉద్యోగులకు సంబంధించిన ఆరోగ్య సేవల విషయంలో హెల్త్ కార్డు పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని TGEJAC ప్రతినిధులు కోరారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రస్తుత విధానంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు TGEJAC వర్గాలు తెలిపాయి.

ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం–TGEJAC మధ్య చర్చల ప్రక్రియను కొనసాగించాలని ఇరువర్గాలు నిర్ణయించినట్లు సమాచారం.

PRC నివేదిక, DA బకాయిలు, CPS–OPS అంశం, పెండింగ్ బిల్లులు, హెల్త్ కార్డు వంటి కీలక అంశాలు ఒకేసారి చర్చకు రావడంతో ఉద్యోగ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ నెల 18న జరిగే తదుపరి సమావేశంలో PRC, DAపై ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయన్నది ఇప్పుడు ప్రధానంగా మారింది.

Leave a Reply