మిర్యాలగూడలో రైతు గర్జన.. కేటీఆర్‌ సమక్షంలో బీఆర్ఎస్‌ రైతు మహాధర్నా

మిర్యాలగూడ, ఈ క్షణం: కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో రైతులకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్‌ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా మిర్యాలగూడలో నిర్వహించిన రైతు మహాధర్నాకు భారీ స్పందన లభించింది. ఎన్ఎస్పీ క్యాంపు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) ముఖ్య అతిథిగా హాజరై రైతులకు సంఘీభావం తెలిపారు.

మహాధర్నాలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మాజీ ఐపీఎస్ అధికారి, మాజీ ఎంపీ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి బీఆర్ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఎన్ఎస్పీ క్యాంపు ప్రాంగణం కిక్కిరిసింది.

పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, మాజీ ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కో-ఆప్షన్ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

రైతుల సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్‌ నాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రైతులకు అండగా పార్టీ ఎప్పటికీ నిలుస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై రైతుల్లో అసంతృప్తి ఉందని, మిర్యాలగూడ మహాధర్నాకు వచ్చిన స్పందనే అందుకు నిదర్శనమని బీఆర్ఎస్‌ నాయకులు పేర్కొన్నారు.

Leave a Reply