ఆర్కేపురంలో ఆత్మీయ సమ్మేళనం

హైదరాబాద్/ఆర్కేపురం, ఈ క్షణం: ఆర్కేపురం డివిజన్‌లోని అల్కాపురి కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వివిధ కాలనీల ప్రజలతో ఆత్మీయంగా మమేకమయ్యారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ ప్రాంతాల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను వినతి పత్రం రూపంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

కార్యక్రమానికి ముందు అల్కాపురి రెసిడెంట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆర్కేపురం డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల అధ్యక్షులు, కార్యదర్శులు తమ ప్రాంతాల్లో ఎదురవుతున్న సమస్యలను వివరించారు.

అల్కాపురి, హరిపురి, సౌభాగ్యపురం, జనప్రియ, సరోజినీదేవి, యాదవ్‌నగర్ తదితర కాలనీల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు.

కాలనీల్లో వర్షం పడిన ప్రతిసారీ రోడ్లు మినీ మూసీని తలపించేలా మారుతున్నాయని స్థానికులు ఎమ్మెల్యేకు వివరించారు. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోందని చెప్పారు. సమస్యలను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినా ఆశించిన స్థాయిలో పరిష్కారం లభించడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలు వివరించిన సమస్యలపై ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సానుకూలంగా స్పందించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థను పునర్నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.

వర్షపు నీరు రోడ్లపై నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థ ద్వారా సక్రమంగా బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ప్రతి కుటుంబం తమ ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుని వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా భూగర్భ జలాలను పెంచడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థపై ఒత్తిడిని కొంత తగ్గించవచ్చని సూచించారు.

కాలనీల్లో నెలకొన్న డ్రైనేజీ, తాగునీరు, రోడ్ల మరమ్మతులు, కమ్యూనిటీ హాళ్లు, CCTV, పార్కింగ్, పార్కుల అభివృద్ధి, వాకింగ్ ట్రాక్‌ల పునరుద్ధరణ వంటి సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

సంబంధిత అధికారులతో మాట్లాడి వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఆత్మీయ సమ్మేళనంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ అధ్యక్షులు, కార్యదర్శులు, రెసిడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు, మహిళలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకుంటూ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Leave a Reply