మంత్రి దామోదర్ రాజనర్సింహకు అలాయ్ బలాయ్ శుభాకాంక్షలు..

టేక్మాల్ / ఆందోల్, ఈ క్షణం, అక్టోబర్ 23: విజయదశమి (దసరా) పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని బొడ్మట్ పల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆందోల్ నియోజకవర్గ పరిధిలోని తార్దాన్ పల్లి గ్రామంలో ఉన్న ఎంఎస్ ఫంక్షన్ హాల్లో మంత్రికి నేరుగా కలసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మంత్రి దామోదర్ రాజనర్సింహతో అలాయ్ బలాయ్ తీసుకుని, స్వీట్లు తినిపించి ఆత్మీయ శుభాకాంక్షలు పంచుకున్నారు.

పండుగ అలాయ్ బలాయ్ శుభాకాంక్షల అనంతరం బొడ్మట్ పల్లి గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. టేక్మాల్ మండలంలోని గ్రామాల మౌలిక వసతుల కల్పనకు, ప్రజా సంక్షేమానికి నిరంతరం సహకరిస్తున్నందుకు మంత్రి దామోదర్ రాజనర్సింహకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ ఆత్మీయ కలయిక కార్యక్రమంలో బొడ్మట్ పల్లి గ్రామ సర్పంచ్ తలారి అవినాష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగభూషణం, చాకలి శివశంకర్, ఆందోల్ విట్టల్, వార్డు మెంబర్ శ్రీశైలం, తలారి మందిర్లతో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రిని కలిసిన వారిలో గ్రామాభివృద్ధి పట్ల ఉత్సాహం వ్యక్తమైంది.