Eekshanam Exclusive: సాగర్‌పై సగం పెత్తనం.. జలాలపై పూర్తి కన్ను!

నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: నాగార్జునసాగర్‌ జలాశయంపై తెలంగాణ నియంత్రణకు గతంలోనే గండి పడింది. రాజకీయ పరిణామాల నేపథ్యంలో సాగర్‌ డ్యామ్‌ గేట్ల నిర్వహణ బాధ్యతలను ఏపీ, తెలంగాణకు చెరిసగం అప్పగించడంతో ప్రాజెక్టుపై పూర్తి పర్యవేక్షణ కోల్పోవాల్సి వచ్చింది. ఇదే అదనుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ సాగర్‌ జలాలపై కన్నేసిందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే శ్రీశైలం జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా మళ్లించుకుంటున్న ఏపీ.. తాజాగా నాగార్జునసాగర్‌ నుంచి కూడా నీటిని తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సాధారణ డెడ్‌ స్టోరేజీ 510 అడుగులుగా ఉండగా.. ఏకంగా 493 అడుగుల స్థాయి నుంచే నీటిని తీసుకునేలా నిర్మాణాలు చేపడుతుండటం తెలంగాణకు ఆందోళన కలిగిస్తోంది.

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో మొత్తం 26 గేట్లు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సాగర్‌ డ్యామ్‌ వద్ద ఏపీ, తెలంగాణ మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) గేట్ల నిర్వహణ బాధ్యతలను రెండు రాష్ట్రాలకు విభజించింది. 13 గేట్ల నిర్వహణ బాధ్యతలను ఏపీకి, మరో 13 గేట్ల బాధ్యతలను తెలంగాణకు అప్పగించింది. అప్పటి నుంచి ఇదే విధానం కొనసాగుతోంది. తెలంగాణ పునర్విభజన చట్టం ప్రకారం సాగర్‌పై తెలంగాణకు ఉండాల్సిన నియంత్రణ విషయంలో ఈ విభజన తీవ్ర చర్చకు దారితీసింది. అప్పటి పాలకులు రాజకీయ ప్రయోజనాల కోసం కేఆర్‌ఎంబీపై ఒత్తిడి తెచ్చి గేట్ల నిర్వహణ బాధ్యతలను పంచుకున్నారనే విమర్శలు ఉన్నాయి.

సాగర్‌ కుడి ప్రధాన కాలువ రెగ్యులేటరీ వ్యవస్థ కూడా ఏపీ నియంత్రణలో ఉండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఒకవైపు డ్యామ్‌లో సగం గేట్ల నిర్వహణ బాధ్యతలు ఏపీ చేతిలో ఉండగా.. మరోవైపు కుడి ప్రధాన కాలువ రెగ్యులేటరీ వ్యవస్థపైనా ఆ రాష్ట్రానిదే నియంత్రణ. దీంతో అటువైపు జరుగుతున్న పనులు, నీటి తరలింపు ఏర్పాట్లపై తెలంగాణ ఇరిగేషన్‌ అధికారులకు పూర్తి సమాచారం, పర్యవేక్షణ ఉండటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టుపై సమగ్ర నియంత్రణ లేకపోవడం ఇప్పుడు తెలంగాణకు ఇబ్బందికరంగా మారిందని సాగునీటిరంగ వర్గాలు పేర్కొంటున్నాయి.

సాగర్‌ గేట్ల నిర్వహణలో వాటాలు పంచుకున్న ఏపీ.. ఇప్పుడు జలాల తరలింపులోనూ కొత్త ఎత్తుగడ వేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులో 493 అడుగుల స్థాయి నుంచే నీటిని తీసుకెళ్లేలా నిర్మాణాలు చేపడుతున్నట్లు ఇరిగేషన్‌ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా సాగర్‌ డెడ్‌ స్టోరేజీ స్థాయి 510 అడుగులుగా పరిగణిస్తుండగా.. దానికంటే సుమారు 17 అడుగుల దిగువనుంచే నీటిని తరలించే అవకాశం ఏర్పడుతుంది. అంటే జలాశయంలో నీటి మట్టం గణనీయంగా తగ్గినా నీటిని మళ్లించుకునే వెసులుబాటు కలిగే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నిర్మాణాల ద్వారా ఏ స్థాయి వరకు నీటిని తరలించవచ్చన్నది కేఆర్‌ఎంబీ నిర్ణయించాల్సి ఉంటుంది.

మరోవైపు హైదరాబాద్‌ మహానగర తాగునీటి అవసరాల కోసం తెలంగాణ ప్రభుత్వం సాగర్‌ జలాలపైనే ఆధారపడుతోంది. ఏకేబీఆర్‌(AKBR), పుట్టంగండి మార్గాల ద్వారా 510 అడుగుల ఉన్నప్పటికీ హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ అధికారులు నీటిని తోడుతున్నారు. మూడు విడతల్లో వెయ్యి క్యూసెక్కుల చొప్పున నీటిని తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ 493 అడుగుల స్థాయి నుంచే నీటిని తరలించుకునే అవకాశం పొందితే తెలంగాణ తాగునీటి అవసరాలు, సాగునీటి ప్రయోజనాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

సాగర్‌ జలాశయం నుంచి ఏ స్థాయిలో నీటిని తీసుకోవాలన్నది కేఆర్‌ఎంబీ నిర్ణయించాలి. బోర్డు అనుమతులు, నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణాలు, నీటి తరలింపు జరగాలి. ఒక్క చుక్క నీటిని కూడా బోర్డు అనుమతి లేకుండా తరలించడానికి వీల్లేదని ఇరిగేషన్‌ వర్గాలు చెబుతున్నాయి. గతంలో గేట్ల నిర్వహణ బాధ్యతల విభజనతో తెలంగాణకు జరిగిన నష్టం పునరావృతం కాకుండా ప్రభుత్వం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. గేట్ల నిర్వహణపై నియంత్రణ, కుడి ప్రధాన కాలువ రెగ్యులేటరీ వ్యవస్థ, 493 అడుగుల నీటి తరలింపు నిర్మాణాలపై సమగ్రంగా సమీక్షించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని సాగునీటిరంగ వర్గాలు కోరుతున్నాయి.