
Eekshanam Exclusive: నల్లగొండ కార్పోరేటర్లు స్ట్రిక్ట్.. కమిషనర్ అవుట్!
- నిబంధనల విషయంలో తగ్గేదేలేదన్న వంశీకృష్ణ.. పైరవీలు, ఒత్తిళ్లకు నో
- కార్పొరేటర్ల సిఫారసులకూ ప్రాధాన్యం ఇవ్వని వైనం
- సిబ్బంది ప్రక్షాళన నుంచి జీపీఎస్ వరకు కీలక మార్పులు
- కాంట్రాక్టు పనుల ఫైళ్లకు నిబంధనల కొర్రీలు
- నాలుగు నెలలకే బదిలీ.. ప్రమోషన్ల నేపథ్యంలో ఆయనే వెళ్లాలని నిర్ణయం?
- గతంలో డైనమిక్ ఆఫీసర్‌గా ప్రశంసించిన మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ వంశీకృష్ణ వ్యవహారశైలి మొదటి నుంచీ చర్చనీయాంశంగానే మారింది. నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరించడం, రాజకీయ పైరవీలకు తలొగ్గకపోవడం, కార్యాలయ పరిపాలనలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టడం వంటి నిర్ణయాలు ఒకవైపు ప్రశంసలు అందుకోగా.. మరోవైపు పాలకవర్గంలోని కొందరు కార్పొరేటర్లకు అసంతృప్తి కలిగించాయి. కార్పొరేటర్ల సిఫారసులకు సైతం ప్రాధాన్యం ఇవ్వకుండా ఫైళ్ల విషయంలో నిబంధనలే ప్రామాణికంగా వ్యవహరించిన ఆయన.. ఇప్పుడు బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ బదిలీ వెనుక రాజకీయ ఒత్తిళ్ల కంటే తనకు ఎదురవుతున్న పరిపాలనా సమస్యలు, రాబోయే ప్రమోషన్లు, వివాదాలకు దూరంగా ఉండాలనే ఆలోచన కూడా ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.
పైరవీలకు నో.. నిబంధనలకే ఓకే!
వంశీకృష్ణ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మున్సిపల్ కార్యాలయంలో పైరవీలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. కార్పొరేటర్లు చెప్పిన ప్రతి పనికీ అంగీకరించకుండా, నిబంధనల ప్రకారం ఫైళ్లు ఉంటేనే ముందుకు తీసుకెళ్లేవారని సమాచారం. ముఖ్యంగా కాంట్రాక్టులు, అభివృద్ధి పనులకు సంబంధించిన ఫైళ్లలో సరైన ప్రొసీడింగ్స్, అనుమతులు, అవసరమైన పత్రాలు లేకపోతే ఆమోదించేందుకు నిరాకరించేవారని తెలుస్తోంది. ఫైల్‌పై ఏదో రాసుకొచ్చి సంతకం చేయించుకునే పద్ధతికి ఆయన అంగీకరించేవారు కాదని ఉద్యోగ వర్గాల్లో చర్చ ఉంది. చట్టబద్ధమైన వ్యవహారాలకే ప్రాధాన్యం ఇస్తూ, వివాదాస్పదమైన ప్రతిపాదనలను పక్కన పెట్టేవారని చెబుతున్నారు. దీంతో ఇంతకాలం సిఫారసులతో పనులు చేయించుకునే అవకాశం ఉన్న కొందరు కార్పొరేటర్లకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
కార్యాలయంలో ప్రక్షాళన..
కమిషనర్‌గా సుమారు నాలుగు నెలల కాలంలోనే కార్యాలయ పరిపాలనలో పలు మార్పులు చేపట్టారు. కంప్యూటర్ ఆపరేటర్లను వేర్వేరు సెక్షన్లకు మార్చడంతోపాటు సిబ్బంది విధుల్లోనూ మార్పులు చేశారు. ఉదయం 10.30 గంటల వరకు అటెండెన్స్ రిజిస్టర్‌ను తన వద్దే ఉంచుకొని ఉద్యోగుల హాజరును పర్యవేక్షించేవారని సమాచారం. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, కార్యాలయానికి ఆలస్యంగా రావడం వంటి అంశాలపై క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇచ్చారు. అవుట్సోర్సింగ్ సిబ్బందిని అదనపు ఉద్యోగులుగా వార్డుల్లో విధులు నిర్వహించేలా పంపించారు. ఫిట్టర్లను సైతం అవసరాలకు అనుగుణంగా ఇతర ప్రాంతాలకు మార్చారు. సరైన అర్హతలు, ధ్రువీకరణ పత్రాలు లేని ఇన్చార్జి ఫిట్టర్లకు సంబంధించి కూడా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాలన్నీ కార్యాలయ పరిపాలనను గాడిలో పెట్టే చర్యలుగా కొందరు అభిప్రాయపడుతుండగా.. మరికొందరికి మాత్రం అసంతృప్తి కలిగించాయి.
జీపీఎస్‌తో డీజిల్ ఆదాకు ప్రయత్నం..
మున్సిపల్ వాహనాల నిర్వహణలోనూ కమిషనర్ మార్పులు తీసుకొచ్చారు. చెత్త సేకరణ ట్రాక్టర్లు, ఇతర వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేయడం ద్వారా వాటి కదలికలను పర్యవేక్షించే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. వాహనాల వినియోగం, డీజిల్ ఖర్చులను నియంత్రించడంతోపాటు పనితీరులో పారదర్శకత తీసుకురావాలన్నది ఈ చర్యల ఉద్దేశంగా చెబుతున్నారు. మరోవైపు కార్యాలయ సిబ్బంది సెక్షన్ల మార్పులు, వార్డుల్లో విధుల కేటాయింపులు వంటి నిర్ణయాలు కూడా పరిపాలనలో క్రమశిక్షణ పెంచే దిశగా చేపట్టినవేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
మాంసం విక్రయాల నుంచి ఆసుపత్రి వ్యర్థాల వరకు..
పట్టణంలో రోడ్లు, ఫుట్‌పాత్‌లపై మాంసం విక్రయాలు, అక్కడే జంతువుల వధ వంటి అంశాలపై కమిషనర్ కఠినంగా వ్యవహరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న విక్రయ కేంద్రాలపై చర్యలు తీసుకోవడంతో వ్యాపారులు కొందరు కార్పొరేటర్లను ఆశ్రయించినట్లు అప్పట్లో చర్చ జరిగింది. నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి వ్యర్థాల సేకరణ విషయంలోనూ సాధారణ చెత్త, బయోమెడికల్ వ్యర్థాలను కలిపి తరలించడానికి వీల్లేదనే నిబంధనల ఆధారంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ, కార్యాలయ పరిపాలనలోనూ నిబంధనల విషయంలో వెనక్కి తగ్గకపోవడంతో కొందరు కార్పొరేటర్లకు ఆయన తీరు నచ్చలేదనే ప్రచారం సాగింది.
భర్తల జోక్యంపైనా అసంతృప్తి!
మహిళా కార్పొరేటర్ల తరఫున వారి భర్తలు మున్సిపల్ పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపైనా కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. డివిజన్ల సమస్యలు, సిబ్బంది విధులు, వ్యక్తిగత పనుల కోసం కార్పొరేటర్ల భర్తలు నేరుగా అధికారులకు ఫోన్లు చేయడం, పరిపాలనా నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం వంటి వాటికి ఆయన ప్రాధాన్యం ఇవ్వలేదని సమాచారం. ప్రజాప్రతినిధులు తమ పరిధిలోని అంశాలను అధికారికంగా తెలియజేయాలని, పరిపాలన మాత్రం నిబంధనల ప్రకారం సాగాలన్నది ఆయన వైఖరిగా చెబుతున్నారు. దీంతో గతంలో అధికారులతో సులభంగా పనులు చేయించుకునే పరిస్థితి ఇప్పుడు లేకుండా పోయిందని కొందరు కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అభివృద్ధి పనుల ఫైళ్ల దగ్గరే అసలు పంచాయితీ!
కార్పొరేటర్ల అసంతృప్తికి మరో ప్రధాన కారణం అభివృద్ధి పనుల వ్యవహారమనే చర్చ ఉంది. పాలకవర్గం ఏర్పడి ఆరు నెలలు దాటినా డివిజన్లలో పనులు ఆశించిన స్థాయిలో ప్రారంభం కాలేదని పలువురు కార్పొరేటర్లు గతంలో ఆవేదన వ్యక్తం చేశారు. జనరల్ ఫండ్ కింద కేటాయించిన నిధులతో చేపట్టాల్సిన పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ, కాంట్రాక్టుల ఫైళ్లు ముందుకు సాగకపోవడంపై అసంతృప్తి వ్యక్తమైంది. అయితే కమిషనర్ మాత్రం సరైన అనుమతులు, ప్రొసీడింగ్స్, నిబంధనలకు అనుగుణంగా ఉన్న ప్రతిపాదనలకే ఆమోదం తెలిపేవారని సమాచారం. హడావుడిగా ఫైళ్లు తీసుకొచ్చి ఆమోదం పొందాలనుకుంటే కుదరదనే ఆయన వైఖరి కొందరు ప్రజాప్రతినిధులకు ఇబ్బందిగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కమిషనర్ వెళ్లిపోవాలనుకున్నారా?
ఈ పరిణామాల మధ్య కమిషనర్ వంశీకృష్ణ బదిలీ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. సుమారు నాలుగు నెలల పాటు పనిచేసిన ఆయన.. ఇక్కడి పరిస్థితులు, తరచూ తలెత్తుతున్న భిన్నాభిప్రాయాలు, వివాదాస్పద వ్యవహారాలకు దూరంగా ఉండాలనే ఆలోచనతో తానే బదిలీ కోరుకున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాబోయే ప్రమోషన్ల నేపథ్యంలోనూ తన తదుపరి పోస్టింగ్‌పై ఆయన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తన హయాంలో జరగని కొన్ని నియామకాలు, ముఖ్యంగా కారుణ్య నియామకాల వ్యవహారం కూడా చర్చకు వస్తోంది. తన పేరుతో ఎవరూ ఎలాంటి సిఫారసులు, అక్రమ వ్యవహారాలు చేయకూడదని, అవినీతిని సహించేది లేదని ఆయన స్పష్టమైన వైఖరితో ఉన్నట్లు ఉద్యోగ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వివాదాలకు తావులేకుండా బదిలీపై వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారనే చర్చ సాగుతోంది. గతంలో కమిషనర్ వంశీకృష్ణ పనితీరును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డైనమిక్ ఆఫీసర్‌గా ప్రశంసించడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. అంతకుముందు రమణాచారి, వేణుగోపాల్‌రెడ్డి వంటి అధికారులు పనిచేసిన తర్వాత వంశీకృష్ణ బాధ్యతలు చేపట్టారు. నిబంధనల అమలు, పరిపాలనా క్రమశిక్షణ, సిబ్బంది ప్రక్షాళన విషయంలో ఆయన తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. అయితే పాలక వర్గంతో భిన్నాభిప్రాయాలు, కార్పొరేటర్ల అసంతృప్తి, అభివృద్ధి పనుల ఫైళ్ల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన వంటి పరిణామాల మధ్య ఆయన బదిలీ కావడం ఇప్పుడు మున్సిపల్ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.







