Eekshanam Exclusive: రేవంత్‌ సర్కార్‌కు రాజగోపాల్ అల్టిమేటం!

నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిపై గతంలోనే తీవ్ర విమర్శలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డినే లక్ష్యంగా చేసుకుని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్‌కు వేల కోట్ల నిధులు తీసుకెళ్తున్నప్పుడు వెనుకబడిన మునుగోడుకు ఎందుకు కేటాయించడం లేదని నిలదీశారు. కొడంగల్‌, మధిర, హుజూర్‌నగర్‌లే తెలంగాణ కాదని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని స్పష్టం చేశారు. ఓవైపు తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ, కాంగ్రెస్‌ పార్టీ, రాహుల్‌గాంధీ నాయకత్వంపై తన విశ్వాసాన్ని చాటుకుంటూనే.. మరోవైపు రేవంత్‌ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వ అవినీతి, కాంట్రాక్టర్ల దోపిడీని ప్రస్తావిస్తూ ప్రస్తుత పాలనలోనూ అలాంటి పరిస్థితులు కొనసాగితే ఎలా అని ప్రశ్నించారు. కమీషన్లు, అధిక ధరల కాంట్రాక్టులు, ప్రజాధనం దుర్వినియోగంపై పరోక్షంగా ప్రభుత్వానికే హెచ్చరికలు జారీ చేశారు. మునుగోడుకు నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని, లేదంటే మరో కురుక్షేత్రానికి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా వెనుకాడబోనని ప్రకటించడం కాంగ్రెస్‌ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

రాజగోపాల్‌ రెడ్డి తాజా వ్యాఖ్యల్లో ఆసక్తికరమైన అంశం.. కాంగ్రెస్‌ అధిష్ఠానం పట్ల తన విధేయతను చాటుకుంటూనే రాష్ట్ర నాయకత్వాన్ని నిలదీయడం. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి, కాంగ్రెస్‌ పార్టీకి తాము ఎంతో రుణపడి ఉన్నామని, పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలు, నాయకులు ఎంతో కష్టపడ్డారని గుర్తుచేశారు. తాను కూడా రాహుల్‌గాంధీ మనిషినేనని స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీ ప్రధాని కావాలన్నదే తమ ఆకాంక్ష అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానని చెబుతూనే, రాష్ట్రంలో మూడేళ్ల పాలనలో ప్రజలు సంతోషంగా లేరని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల కోసం పుట్టిన పార్టీ అని, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ఆశయాలకు అనుగుణంగా ఇందిరమ్మ రాజ్యం పనిచేయాలని హితవు పలికారు. పార్టీపై విశ్వాసం.. ప్రభుత్వ పెద్దల తీరుపై అసంతృప్తి అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు సాగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

కొడంగల్‌కు రూ.10 వేల కోట్లు తీసుకెళ్తామని చెబుతున్నారని, మరి మునుగోడు, ములుగు, ఆదిలాబాద్‌ వంటి వెనుకబడిన ప్రాంతాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కొడంగల్‌, మధిర, హుజూర్‌నగర్‌లే తెలంగాణ కాదని, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు తమ నియోజకవర్గాలతో పాటు మిగతా ప్రాంతాల అభివృద్ధిపైనా దృష్టి పెట్టాలని సూచించారు. కొడంగల్‌కు రూ.10 వేల కోట్లు కాకపోతే రూ.20 వేల కోట్లు తీసుకెళ్లినా తనకు అభ్యంతరం లేదని, కానీ మునుగోడు వంటి ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలకు నిధులు ఎందుకు కేటాయించడం లేదని నిలదీశారు. అభివృద్ధి కోసం అడిగినప్పుడు సానుకూలంగా స్పందించాల్సింది పోయి పండబెట్టి తొక్కుతాననే భాష ఉపయోగించడం ఏంటని సీఎంని ప్రశ్నించారు.

గత బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పేరుతో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని రాజగోపాల్‌ రెడ్డి ఆరోపించారు. ఆంధ్రా కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులకు దోచిపెట్టడం వల్ల ఏర్పడిన అప్పులకు అసలు, మిత్తీ చెల్లించడానికే ప్రస్తుత ప్రభుత్వానికి ఆదాయం సరిపోవడం లేదన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులనే ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తే పేదలకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతిలో భాగస్వాములైన వారిని వదిలిపెట్టకుండా విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. భూముల వ్యవహారాలు, కాంట్రాక్టులు, హైదరాబాద్‌ చుట్టుపక్కల భూముల పేరుతో జరిగిన కుంభకోణాలను వెలికితీసి ప్రభుత్వ సొమ్మును రికవరీ చేయాలని, బాధ్యులను జైలుకు పంపాలని అన్నారు. అధిక ధరలకు కాంట్రాక్టులు కట్టబెట్టడం వల్ల ప్రభుత్వంపై అప్పుల భారం పెరిగిందని, అవినీతిని నిర్మూలిస్తేనే సంక్షేమ పథకాలకు నిధులు సమకూరుతాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నిస్తున్న తాను.. ప్రస్తుత ప్రభుత్వంలోనూ అలాంటి వ్యవహారాలు చోటు చేసుకుంటే చూస్తూ ఊరుకోబోననే సంకేతాలను ఇచ్చారు.

కాంట్రాక్టులు, కమీషన్ల వ్యవహారంపైనా రాజగోపాల్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. రూ.వెయ్యి కోట్ల కాంట్రాక్టు అయినా, రూ.5 వేల కోట్ల కాంట్రాక్టు అయినా ప్రభుత్వం చెప్పిన మొత్తానికి 20 శాతం తక్కువకే పనులు చేయిస్తానని సవాల్‌ విసిరారు. తాను కమీషన్లు ఇవ్వనని, తీసుకోనని స్పష్టం చేశారు. ప్రభుత్వ సొమ్మును అధికారంలో ఉన్నవారు నిజాయితీగా ఖర్చు చేయాలని సూచించారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే మునుగోడు నుంచి రాజన్న సైన్యం కదులుతుందని, ప్రజల సొమ్మును దోచుకునే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు కేవలం గత ప్రభుత్వంపైనే కాకుండా ప్రస్తుత పాలనలోనూ అవినీతి, కమీషన్లకు తావుండకూడదన్న హెచ్చరికగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ పేదల పార్టీ అని, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రాజగోపాల్‌రెడ్డి గుర్తుచేశారు. మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులకు రూ.4 వేల పింఛన్‌ ఇస్తామని చెప్పామని, ఆ హామీలను అమలు చేయాలని కోరారు. పింఛన్లను రూ.5 వేలకు పెంచినా తప్పులేదని అన్నారు. హైదరాబాద్‌ నగరానికి వస్తున్న ఆదాయంతో పేద ప్రజలను ఆదుకోవాలని సూచించారు. ప్రతి మండల కేంద్రంలో వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలని, ప్రైవేటు ఆసుపత్రుల్లో కమీషన్లు, అధిక బిల్లుల పేరుతో పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్న పరిస్థితిని అరికట్టాలని కోరారు. వైఎస్సార్‌ హయాంలో అమలైన ఉచిత విద్య, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉచిత విద్యుత్‌ పథకాలను గుర్తుచేస్తూ.. పేదలకు విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.

తన పోరాటం పదవుల కోసం కాదని, మునుగోడు అభివృద్ధి కోసమేనని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే తన లక్ష్యమన్నారు. అత్యధిక ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతమైన మునుగోడులో ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారని, చెరువులు, కుంటల అభివృద్ధికి కనీసం రూ.500 కోట్లు కూడా కేటాయించలేదని విమర్శించారు. డిండి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు ప్రారంభం కాకపోవడం, రోడ్లకు నిధులు లేకపోవడం, చౌటుప్పల్‌లో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభానికి నోచుకోకపోవడం వంటి సమస్యలను ప్రస్తావించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ప్రతిపక్ష ఎమ్మెల్యే లా పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడులో ప్రతిపక్ష పార్టీలకు పని లేకుండా తానే ప్రజల తరఫున పోరాడుతున్నానని వ్యాఖ్యానించారు.

తన విమర్శలను మంత్రి పదవి దక్కకపోవడంతో చేస్తున్న అసంతృప్తి రాజకీయాలుగా చిత్రీకరించడాన్ని రాజగోపాల్‌రెడ్డి ఖండించారు. పదవులు శాశ్వతం కాదని, అధిష్ఠానం ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేది నిర్ణయిస్తుందని అన్నారు. పదవుల కోసం ఎవరి ఇళ్ల చుట్టూ తిరిగే అలవాటు తనకు లేదని, ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం తన నైజమని చెప్పారు. మునుగోడు ప్రజలు ఆత్మగౌరవం ఉన్న నాయకుడిని ఎన్నుకున్నారని, పదవుల కోసం పాకులాడే నాయకుడిని కాదని వ్యాఖ్యానించారు. నియోజకవర్గానికి నిధులు ఇవ్వకుండా అభివృద్ధిలో వివక్ష చూపితే మరో కురుక్షేత్రం తప్పదని హెచ్చరించారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా వెనుకాడబోనని స్పష్టం చేశారు. మునుగోడు ప్రజలకు అన్యాయం చేసినా, ప్రజాధనాన్ని దోచుకున్నా ఎవరినీ వదిలిపెట్టబోనని హెచ్చరిం చారు.

ఒకవైపు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ నాయకత్వంపై తన నిబద్ధతను చాటుకుంటూ, మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనా తీరును బహిరంగంగా ప్రశ్నిస్తున్న రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామంగా మారాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే క్రమశిక్షణ ఉల్లంఘించినట్టుగా భావించవద్దని, నాలుగు గోడల మధ్య ఇచ్చే వినతులను పట్టించుకోనప్పుడు ప్రజల ముందు మాట్లాడాల్సి వస్తోందని ఆయన చెబుతున్నారు. మూడేళ్ల పాలనలో ప్రజలు సంతోషంగా లేరని, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నారు. ఆయన హెచ్చరికలను ప్రభుత్వం ఎలా పరిగణనలోకి తీసుకుంటుందన్నది ఇప్పుడు కీలకం. అధిష్ఠానంపై విశ్వాసం ప్రకటిస్తూనే సీఎం తీరుపై పోరాటం కొనసాగిస్తానన్న రాజగోపాల్‌రెడ్డి వైఖరి.. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ అంతర్గత రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.