Breaking News: నవంబర్ నుంచి పెరగనున్న కరెంట్ బిల్లులు..

హైదరాబాద్ ఈక్షణం, నవంబర్ 01: ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం, కరువు పరిస్థితులు రాష్ట్ర రైతాంగాన్ని, ప్రజలను అతలాకుతలం చేస్తుండగా.. మరోవైపు తెలంగాణలోని గృహ, వాణిజ్య విద్యుత్ వినియోగదారులపై ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరాల్లో (2022-23, 2023-24) విద్యుత్ కొనుగోలు వ్యయం మరియు రెవెన్యూ లోటును సర్దుబాటు చేసేందుకు గాను రూ. 5,420.23 కోట్ల ట్రూ అప్ (True-Up) ఛార్జీలను ప్రజల నుంచి వసూలు చేసేందుకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (TGERC) డిస్కంలకు అనుమతి మంజూరు చేసింది.

ఈ నిర్ణయంతో 2026 నవంబర్ నెల నుంచి జారీ చేసే కరెంట్ బిల్లుల్లో వినియోగదారులకు అదనపు విద్యుత్ భారం పడనుంది.

టీజీఈఆర్‌సీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, వసూళ్ల ప్రక్రియ దశలవారీగా సాగనుంది.

నవంబర్ నెలలో: యూనిట్‌కు 30 పైసల చొప్పున అదనపు ఛార్జీ విధిస్తారు.

డిసెంబర్ నెల నుంచి: యూనిట్‌కు 50 పైసల చొప్పున అదనంగా వసూలు చేస్తారు.

అంటే నవంబర్ నెలలో 100 యూనిట్ల కరెంట్ ఉపయోగించే సాధారణ గృహ వినియోగదారునికి రూ. 30 అదనపు భారం పడనుండగా, డిసెంబర్ నెల నుంచి ప్రతి 100 యూనిట్లకు రూ. 50 చొప్పున అదనంగా కరెంట్ బిల్లు రానుంది.  

రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోయి, తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న ఈ కష్టకాలంలో కరెంట్ ధరల అదనపు మోత విధించడంపై పౌరుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అయితే, వ్యవసాయ రంగానికి ఇచ్చే ఉచిత విద్యుత్ విధానానికి విఘాతం కలగకుండా, రైతులపై పడే రూ. 2,214.99 కోట్ల వాటాను నేరుగా ప్రభుత్వ సబ్సిడీ రూపంలోనే చెల్లించాలని టీజీఈఆర్‌సీ స్పష్టం చేసింది.

నవంబర్ నుంచి వచ్చే బిల్లుల్లో సాధారణ ఛార్జీలతో కలపకుండా, ట్రూ అప్ ఛార్జీలను స్పష్టంగా ప్రత్యేక లైన్ ఐటమ్‌గా చూపించాలని విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశించారు.