
నల్గొండ జిల్లాలో కెమికల్ మాఫియా.. సాగర్ కాలువలో ప్రమాదకర వ్యర్థ రసాయనాలు..
- నిద్రమత్తులో పీసీబీ!
- పెద్దవూర మండలం చింతపల్లి వద్ద కాలువలో రసాయనాల పారబోత..
- ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, సీసీటీవీల పరిశీలన..
నల్గొండ ఈక్షణం, నవంబర్ 02: నల్గొండ జిల్లాలో కెమికల్ కంపెనీల మాఫియా అరాచకాలు తారాస్థాయికి చేరాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పర్యావరణాన్ని, నీటి వనరులను నాశనం చేస్తూ రసాయన వ్యర్థాలను ఇష్టానుసారంగా పారబోస్తున్నారు. తాజాగా నాగార్జునసాగర్ లోలెవల్ కాలువలో అత్యంత ప్రమాదకరమైన కెమికల్ వ్యర్థాలను రహస్యంగా వదులుతున్న ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పెద్దవూర మండలం చింతపల్లి గ్రామం సమీపంలో ఈ దుశ్చర్య వెలుగులోకి రావడంతో ప్రజలు, సాగునీటి సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైవేల వెంట నుంచి నేరుగా కాలువల్లోకి కెమికల్స్..
ఇంతకాలం హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవే పరిసర ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, అసైన్డ్ భూముల్లో రాత్రి సమయాల్లో కెమికల్ వ్యర్థాలను డంప్ చేస్తూ వచ్చిన మాఫియా, ఇప్పుడు ఏకంగా నాగార్జునసాగర్ లోలెవల్ కాలువల్లోకి వ్యర్థ రసాయనాలను వదిలే స్థాయికి తెగించింది. సాగర్ కాలువ నీటిని నమ్ముకున్న ఆయా గ్రామాల ప్రజలు, పశువులు మరియు పంటల సాగుకు ఈ కెమికల్ నీరు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.
మామూళ్ల మత్తులో పీసీబీ.. నిందితుల కోసం గాలింపు
ఫ్యాక్టరీల నుంచి వెలువడే హానికరమైన వ్యర్థ రసాయనాలను నిర్దేశిత ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు తరలించాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (PCB) అధికారులదే. అయితే, ట్యాంకర్లు కంపెనీల నుంచి బయలుదేరిన దగ్గరి నుంచి ప్లాంట్‌కు చేరే వరకు జీపీఎస్ (GPS) లేదా ఆన్‌లైన్ ట్రాకింగ్ చేయకపోవడం వల్లే మాఫియా ఈ అక్రమాలకు పాల్పడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. పీసీబీ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ చోద్యం చూస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
ఈ దారుణంపై ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తమై వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కాలువ వైపు వచ్చే రహదారులపై ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ.. కెమికల్ ట్యాంకర్లతో వచ్చి రసాయనాలు వదిలిన నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సాగర్ కాలువలో రసాయనాలు పారబోసిన కఠిన దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.







