
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పొడిగింపు..
- నామినేషన్ల ఆఖరి తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్న సీఈవో సుదర్శన్ రెడ్డి!
- ఆన్లైన్ సర్వర్లు మొరాయించడంతో పట్టభద్రులకు ఊరట..
- ఫారం-18 దరఖాస్తుల స్వీకరణపై స్పష్టతనిచ్చిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి!
హైదరాబాద్ ఈక్షణం, నవంబర్ 03: తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజులుగా ఆన్లైన్ పోర్టల్ సర్వర్లు పనిచేయక, దరఖాస్తుల ప్రక్రియ నిలిచిపోవడంతో ఆందోళన చెందుతున్న పట్టభద్రులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి. సుదర్శన్ రెడ్డి ఊరటనిచ్చారు.
నిర్దేశిత గడువు నవంబర్ 6తో ముగియనున్నప్పటికీ, సాంకేతిక సమస్యల కారణంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు వీలుగా నామినేషన్ల దాఖలు చివరి తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
సర్వర్ల మొరాయింపుతో సీఈవో స్పందన..
మహబూబ్నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ అలాగే వరంగల్ – ఖమ్మం – నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా తయారీకి అధికారులు కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నవంబర్ 6 నాటికి గడువు ముగియనుండటంతో ఆన్లైన్లో ‘ఫారం-18’ (Form-18) దరఖాస్తు చేయడానికి ప్రయత్నించిన లక్షలాది మంది పట్టభద్రులకు ‘సర్వర్ డౌన్’ (Error 503) సమస్య ఎదురైంది.
దీంతో సోమవారం వరకు వెబ్సైట్ పనిచేయకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన సీఈవో సుదర్శన్ రెడ్డి.. సాంకేతిక లోపాలను తక్షణమే సరిచేసి సేవలను పునరుద్ధరిస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
పట్టభద్రులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి..
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా పేరు నమోదు చేసుకోవడానికి డిగ్రీ లేదా తత్సమాన సర్టిఫికెట్, ఆధార్ కార్డు మరియు అడ్రస్ ప్రూఫ్ పత్రాలు తప్పనిసరి. గడువును పొడిగించినందున, ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.







