సొంత ప్రభుత్వంపైనే రాజగోపాల్‌రెడ్డి తిరుగుబాటు..?

మునుగోడు, ఈక్షణం: సొంత ప్రభుత్వంపైనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పదవి ఇస్తామని మూడేళ్లుగా చెబుతున్నారని, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరినా ఆశించిన స్పందన లేదని వ్యాఖ్యానించారు. ఆదివారం గట్టుప్పల్ మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన ప్రభుత్వ పనితీరు, నియోజకవర్గ అభివృద్ధిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో తన పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా మంత్రి పదవి ఇస్తామని, మరికొన్ని హామీలు ఇచ్చారని పేర్కొన్నారు. జనంలో మంచి పేరు తెచ్చుకుంటే శత్రువులు ఎక్కువవుతున్నారని, తాను మంత్రి అయితే రాజకీయంగా మరింత ఎదుగుతాననే భయంతో అడ్డంకులు సృష్టిస్తున్నారనే చర్చ ఉందన్నారు. అభివృద్ధి పనుల కోసం కష్టపడుతుంటే కొందరు వెనుక నుంచి అడ్డుపడుతున్నారని వ్యాఖ్యానించారు.

Komatireddy Rajagopal Reddy Revolt Own Government Munugode Funds

హైదరాబాద్‌కు సమీపంలో ఉన్నప్పటికీ మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. టెండర్లు పిలిచి పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్లు బిల్లులు రాక ఆరు నెలలు, ఏడాది ఎదురుచూసి పనులు వదిలేసి వెళ్లిపోతున్నారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, జీతాలు, పింఛన్లు, రైతుబంధు చెల్లింపులకు కూడా నిధుల కొరత ఉందని ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి మంత్రి పదవి గురించి అడిగినా మూడేళ్లు గడిచిపోయాయని, ఇక ఆ విషయాన్ని అర్థం చేసుకున్నానని అన్నారు. తనకు పదవుల కంటే మునుగోడు అభివృద్ధే ముఖ్యమని, అందుకే నిధుల కోసం భట్టి విక్రమార్కను కూడా కలిశానని చెప్పారు.

మునుగోడు ప్రజల అభివృద్ధి కోసమే తాను ఎమ్మెల్యేగా గెలిచానని, ఆ లక్ష్యాన్ని నెరవేర్చలేని పదవిలో ఉండటం కూడా దండగేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చినప్పుడు ఎల్బీనగర్‌లో పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పారని, అయితే తనకు ఎల్బీనగర్ వద్దని, మునుగోడు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేసినట్లు రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు.