బీజేపీకి బీఆర్‌ఎస్‌ స్క్రిప్ట్‌!

హైదరాబాద్‌, ఈక్షణం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ స్క్రిప్ట్‌ను బీజేపీ నేతలు చదువుతున్నారని విమర్శించారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న కిషన్‌రెడ్డి తెలంగాణకు ఏం సాధించారని ప్రశ్నించారు.

తెలంగాణకు పెట్టుబడులు రావడం లేదంటూ బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చామల మండిపడ్డారు. డీపీఐఐటీ గణాంకాల ప్రకారం మార్చి 2026లో 543 మిలియన్‌ డాలర్లుగా ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు జూన్‌ నాటికి 1.32 బిలియన్‌ డాలర్లకు పెరిగాయని తెలిపారు. భారత్‌ సమ్మిట్‌లో ఎనిమిది ప్యానెల్‌ చర్చలు జరిగాయని, ఫ్యూచర్‌ సిటీకి సంబంధించి రూ.18 వేల కోట్ల పెట్టుబడుల ప్రణాళికపై చర్చించామని చెప్పారు. డిసెంబర్‌ 7, 8 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌తో మరిన్ని పెట్టుబడులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ఢిల్లీలో జరిగిన తెలంగాణ రైజింగ్‌ సమ్మిట్‌ కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ హాజరైతే.. తెలంగాణకు చెందిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎందుకు రాలేదని చామల ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి నిధులు, పెట్టుబడులు తీసుకురావాలని సూచించారు.

రీజినల్‌ రింగ్‌ రోడ్డు, మెట్రో ఫేజ్‌-2, మూసీ పునరుజ్జీవనం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, విభజన హామీలు, ఐఐఎం ఏర్పాటు వంటి అంశాలపై కిషన్‌రెడ్డి కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

రూ.21 వేల కోట్లకు పైగా వ్యయంతో 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని చామల తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్‌కార్డులు, పింఛన్ల మంజూరు వంటి పథకాలను వివరించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను కూడా పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేకపోయిందని విమర్శించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ రాజకీయ విమర్శలు మానుకుని తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని చామల సూచించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, విభజన హామీల సాధనకు కృషి చేయాలని కిషన్‌రెడ్డిని డిమాండ్‌ చేశారు.