
ఎల్ నినో పరిస్థితులను సమష్టిగా ఎదుర్కొందాం: గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపు
- నకిరేకల్ లో ఎల్‌నినోపై ప్రత్యేక అవగాహన సదస్సు..
- హాజరైన శాసనమండలి చైర్మన్ గుత్తా, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం మరియు కలెక్టర్ చంద్రశేఖర్..
- కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
నకిరేకల్ ఈక్షణం, నవంబర్ 04: రాష్ట్రంలో ఎల్‌నినో (El Nino) ప్రభావంతో తలెత్తుతున్న సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని, అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
బుధవారం నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్లో ‘ఎల్ నినో – ముందస్తు నివారణ చర్యలు’ పై నిర్వహించిన నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు.
అధికారులంతా పూర్తి పట్టుతో వ్యవహరించాలి – చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
ఈ సందర్భంగా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం వల్ల తాగునీరు, వ్యవసాయం, విద్యుత్, పశుసంపద, భూగర్భ జలాలు, ఆహారం మరియు కూలీల ఉపాధి రంగాలపై పడకుండా సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. డిమాండ్ ఉన్న పంటలను పండించడం ద్వారా రైతులకు మంచి ఆదాయం వచ్చేలా చూడాలని సూచించారు.
వర్షపు నీరు కళ్లాలలో తడిచిపోకుండా వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. వచ్చే సీజన్లలో రైతులు సన్నధాన్యాన్ని పండించేలా చైతన్యం చేయాలని, రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసి సన్న బియ్యం సరఫరా చేసేలా ప్రోత్సహించాలని కోరారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండి నీటి వృధాను అరికట్టాలని స్పష్టం చేశారు.
డిసెంబర్, జనవరి నుండి నీటి సమస్య తీవ్రమయ్యే అవకాశం: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం వల్ల భవిష్యత్తులో బోర్లు ఎండిపోయే ప్రమాదం ఉందని, రాబోయే డిసెంబర్, జనవరి నెలల్లో నీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి రైతులు యాసంగిలో వరి సాగును తగ్గించి, భూగర్భ జలాలను కాపాడుకునేలా ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని కోరారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి: ప్రభుత్వ విప్ వేముల వీరేశం
ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ.. ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని తెలిపారు. గత ప్రభుత్వం కాలంలో ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసి ఉంటే నేడు ఈ కరువు పరిస్థితులు వచ్చేవి కాదన్నారు. భూగర్భ జలాలు పడిపోతే అవసరమైన ప్రాంతాల్లో అద్దె బోర్ల ద్వారా తాగునీరు అందించేందుకు, ఉపాధి హామీ కింద గ్రామీణ మట్టి రోడ్ల పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.
కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్..
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. గ్రామాలలో నీటి వనరుల విశ్లేషణ చేయాలని, కురిసిన ప్రతి వర్షపు చుక్క భూమిలోకి ఇంకేలా ఇంకుడు గుంతలు, ఊట కుంటలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఎల్‌నినో పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నంబర్ ‘1800-425-1442’తో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘జలసిరి బతుకమ్మ’ వీడియో సీడీని ఆవిష్కరించగా, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాటల ద్వారా ఎల్‌నినోపై అవగాహన కల్పించారు.







