
Video: బడిలో మద్యం తాగుతూ పట్టుబడ్డ హెడ్మాస్టర్..
- ఆసిఫాబాద్ జిల్లాలో విద్యార్థులు, గ్రామస్తుల సంచలన దాడి..
- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న వైనం..
- తిర్యాణి మండలం గంభీరావుపేట ఎంపీయూపీఎస్ స్కూల్లో ఘటన..
- రోజూ తాగి వచ్చి పాఠాలు చెబుతున్నాడని ఎంఈవోకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు
ఆసిఫాబాద్ ఈక్షణం, నవంబర్ 03: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు (Headmaster) బడిలోనే మద్యం మత్తులో తూలుతూ అభాసుపాలయ్యాడు. ఏకంగా పాఠశాల వేళల్లో, విద్యార్థుల ముందే మద్యం సేవిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఈ ఘటన కుమ్రభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గంభీరావుపేట ఎంపీయూపీఎస్ (MPUPS) పాఠశాలలో హెడ్మాస్టర్గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ తీరు పట్ల విద్యార్థులు, గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల ద్వారా వెలుగులోకి హెచ్ఎం లీలలు..
పాఠశాలకు రావాల్సిన హెడ్మాస్టర్ శ్రీనివాస్ గత కొంతకాలంగా తరచూ మద్యం సేవించి స్కూల్‌కు వస్తున్నాడని, బడిలోనే మందు తాగుతూ విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలిపారు.
దీంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు మంగళవారం పాఠశాలపై నిఘా పెట్టగా, హెచ్ఎం శ్రీనివాస్ బడి గదిలోనే మద్యం సేవిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న హెడ్మాస్టర్ తీరును చూసి గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యా శాఖ అధికారులకు ఫిర్యాదు.. సస్పెన్షన్‌కు డిమాండ్!
స్కూల్లో మద్యం తాగుతూ పట్టుబడిన హెచ్ఎం శ్రీనివాస్‌ను గ్రామస్తులు గట్టిగా నిలదీశారు. అనంతరం అక్కడికక్కడే మండల విద్యాశాఖ అధికారికి (MEO) ఫోన్ ద్వారా సమాచారం అందించి, పాఠశాల వద్దకు రప్పించారు. హెడ్మాస్టర్ తప్పును ఆధారాలతో సహా ఎంఈవో ముందు బయటపెట్టి, ఆయనపై తక్షణమే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, సర్వీస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పవిత్రమైన విద్యాసంస్థలను ఇలాంటి మందుబాబులైన ఉపాధ్యాయులు భ్రష్టుపట్టిస్తున్నారని తల్లిదండ్రులు వాపోయారు.







