
90 సీట్లు కాదు.. 9 సీట్లు, 9 లక్షల ఓట్లు, కోటి తిట్లు ఖాయం: దూదిమెట్ల బాలరాజు యాదవ్
- డిసెంబర్ 10న నల్లగొండలో కేటీఆర్ సింహగర్జన!
- తెలంగాణ భవన్ ప్రెస్మీట్లో బీఆర్ఎస్ నేత ఘాటు విమర్శలు..
- పల్నాడు వాటర్ గ్రిడ్ పేరుతో నీటి తరలింపు, అక్రమ అరెస్టులపై మండిపాటు..
- అరెస్ట్ చేయాల్సి వస్తే సీఎం రేవంత్‌నే చేయాలని డిమాండ్!
హైదరాబాద్ / నల్లగొండ ఈక్షణం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2028 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 90 సీట్లు రావని, కేవలం 9 సీట్లు, 9 లక్షల ఓట్లు, కోటి తిట్లు ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణ సాధించిన కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరును తీవ్రంగా ఖండించారు.
అరెస్ట్ చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డినే చేయాలి..
ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని దూదిమెట్ల హెచ్చరించారు. సిట్లు వేసినా, అరెస్టులు చేసినా కేసీఆర్ సైనికులుగా భయపడేది లేదని, అరెస్ట్ చేయాల్సి వస్తే దిగజారుడు భాష మాట్లాడుతున్న రేవంత్ రెడ్డినే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
మానసిక స్థితిపై వ్యాఖ్యలు: కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పినట్లుగానే రేవంత్ రెడ్డి మానసిక స్థితి సరిగా లేదని, ఆయన పరిస్థితి ‘ఆహా నా పెళ్ళంట’ సినిమాలో నూతన్ ప్రసాద్ పాత్రలా మారిందని ఎద్దేవా చేశారు.
రావణాసురుడితో పోలిక: రేవంత్ రెడ్డి రాముడు కాదని, రావణాసురుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిట్లర్ ఆదర్శమన్న వ్యక్తి రాముడు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారని, ఇంటర్ బోర్డును రద్దు చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
హామీలపై నిలదీత: నిరుద్యోగులకు రూ. 4 వేల భృతి, వికలాంగులకు రూ. 6 వేల పెన్షన్ హామీలు ఏమయ్యాయని నిలదీశారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.
పల్నాడు వాటర్ గ్రిడ్ పేరుతో నీటి తరలింపు.. డిసెంబర్ 10న నల్లగొండలో సింహగర్జన!
పల్నాడు వాటర్ గ్రిడ్ పేరుతో తెలంగాణ రాష్ట్ర నీళ్లను ఆంధ్రప్రదేశ్‌కు తరలించుకుపోతున్నారని, నాగార్జునసాగర్ నుంచి నీటిని తరలిస్తూ తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని దూదిమెట్ల ఆరోపించారు. చెరువులు, కాలువల్లో నీళ్లు లేకున్నా పంప్‌హౌస్‌లు ఎందుకు నడపడం లేదని ప్రశ్నించారు. కేటీఆర్, హరీశ్ రావు పదేపదే హెచ్చరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఏపీ నీళ్లు తరలిపోతుంటే రేవంత్ చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబుకు రేవంత్ రెడ్డి చెప్రాసీలా వ్యవహరిస్తున్నారని, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ అధికారులను తీసుకొచ్చి కీలక పదవుల్లో నియమిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ జలాల విషయంలో ఆదిత్యనాథ్ దాస్ వ్యవహారశైలి రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందన్నారు. కృష్ణా జలాల కోసం డిసెంబర్ 10న నల్లగొండలో కేటీఆర్ సింహగర్జన చేయనున్నట్లు వెల్లడించారు.
మహేష్ కుమార్ గౌడ్, బల్మూర్ వెంకట్, అద్దంకి దయాకర్లను అరెస్ట్ చేయాలి..
కేఆర్ఎంబీ వద్దకు వెళ్తున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండించిన దూదిమెట్ల.. క్షుద్ర పూజలు చేస్తున్నారని అన్న మహేష్ కుమార్ గౌడ్‌ను, అలాగే ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, అద్దంకి దయాకర్లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 2028లో ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ సమావేశంలో ఉపేంద్ర చారి, అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, దేవరి మల్లప్ప, బైండ్ల విజయ్ కుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.







