తెలంగాణపై ‘అర్నాబ్’ తుఫాను ప్రభావం..: అక్టోబర్ 27, 28 తేదీల్లో భారీ వర్షాలు..

హైదరాబాద్ ఈక్షణం, అక్టోబర్ 27: బంగాళాఖాతంలో తీవ్రరూపం దాల్చిన తీవ్ర తుఫాను ‘అర్నాబ్’ (Cyclone Arnab) ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 27 రాత్రి నుంచి 28వ తేదీ వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి. అక్టోబర్ 28 ఉదయం వేళల్లో ఈ తుఫాను మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

తుఫాను తీవ్రత దృష్ట్యా ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాల ప్రజలు, రైతులు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వాతావరణ సూచనల ప్రకారం జిల్లాల వారీగా వర్షపాతం మరియు ఈదురుగాలుల ప్రభావం ఈ క్రింది విధంగా ఉండనుంది:

Cyclone Arnab Impact Telangana Heavy Rains Alert Hyderabad

తూర్పు తెలంగాణ (రెడ్ అలర్ట్ జిల్లాల్లో): అక్టోబర్ 28న ఈ ప్రాంతాల్లో 100 నుంచి 120 మిమీ (Heavy to Very Heavy Rains) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.

మధ్య తెలంగాణ (బ్లూ మార్క్ జిల్లాల్లో): అక్టోబర్ 27 రాత్రి నుండి 28 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అక్టోబర్ 28న 30 మిమీ వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలుల వేగం గంటకు 40 కిమీ వరకు ఉంటుంది.

పశ్చిమ & దక్షిణ తెలంగాణ (గ్రీన్ మార్క్ జిల్లాల్లో): రాజధాని హైదరాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో 15 మిమీ లోపే తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. గాలుల వేగం గంటకు 35 కిమీ వరకు నమోదు కావచ్చు.

వాతావరణ నివేదికల ప్రకారం.. అక్టోబర్ 29న రాష్ట్రంలో వర్షాల తీవ్రత తగ్గి వాతావరణంలో తాత్కాలిక విరామం లభించనుంది. అయితే తిరిగి అక్టోబర్ 30వ తేదీ తర్వాత హైదరాబాద్ నగరంతో సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాల తీవ్రత మళ్లీ పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు.

వర్షాలు, ఈదురుగాలుల ముప్పు ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు తమ పంట ఉత్పత్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.