Breaking News: గణేష్ నవరాత్రులు: డీజేలకు నో పర్మిషన్.. సోషల్ మీడియా పై ప్రత్యేక మానిటరింగ్: ఎస్పీ

నల్లగొండ, క్షణం రానున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ప్రజలకు సూచించారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే అధిక శబ్దంతో కూడిన లౌడ్‌స్పీకర్లు, డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

వినాయక మండపాల వద్ద కానీ, నిమజ్జన ఊరేగింపుల సమయంలో కానీ డీజే సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయరాదని ఎస్పీ హెచ్చరించారు. మండపాల వద్ద స్పీకర్లను పరిమిత శబ్దంతో మాత్రమే వినియోగించాలని, అదీ రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతించాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి డీజేలు, అధిక శబ్దంతో కూడిన సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసే సమయంలో ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. మండపాల ఏర్పాటు కోసం స్థల యజమానుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు.

పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగే విధంగా ఉత్సవాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.

వినాయక మండపాల నిర్వాహకులు ముందుగా అవసరమైన అన్ని శాఖల అనుమతులు పొందాలని పోలీసులు సూచించారు. విగ్రహాల ఏర్పాటు కోసం నిర్వాహకులు తెలంగాణ పోలీస్ పోర్టల్‌లో వివరాలను నమోదు చేసి, దరఖాస్తును సంబంధిత పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలని తెలిపారు.

తెలంగాణ పోలీస్ పోర్టల్

వినాయక చవితి సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు, వీడియోలు, సందేశాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఇతర మతాల వారి మనోభావాలను దెబ్బతీసేలా పోస్టులు చేయడం, రెచ్చగొట్టే లేదా వివాదాస్పద కంటెంట్‌ను ప్రచారం చేయడంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

ఇందుకోసం జిల్లాలో ప్రత్యేక సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, రూమర్లను నమ్మవద్దని, అనుమానాస్పద సమాచారం కనిపిస్తే పోలీసులకు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని సూచించారు.

  • మండపం ఏర్పాటు చేసే స్థల యజమాని అనుమతి తీసుకోవాలి.
  • విద్యుత్ శాఖ అనుమతితోనే విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలి.
  • షార్ట్‌సర్క్యూట్ ప్రమాదాలు జరగకుండా నాణ్యమైన వైర్లు ఉపయోగించాలి.
  • మండప కమిటీ సభ్యులు, బాధ్యుల పేర్లు, ఫోన్ నంబర్లను మండపం వద్ద ప్రదర్శించాలి.
  • ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా మండపాన్ని ఏర్పాటు చేయాలి.
  • విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంతంలో నాణ్యమైన స్టేజ్, షెడ్ ఏర్పాటు చేయాలి.
  • మండపం వద్ద 24 గంటలూ కనీసం ఇద్దరు వాలంటీర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలి.
  • భక్తుల కోసం క్యూలైన్లు ఏర్పాటు చేసి, తగినంత మంది వాలంటీర్లను నియమించాలి.
  • మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట ఆడటం నిషేధం.
  • అసభ్యకర నృత్యాలు, ఇతర మతాలను కించపరిచే ప్రసంగాలు, పాటలు నిర్వహించరాదు.
  • పోలీసుల తనిఖీల కోసం తప్పనిసరిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేయాలి.
  • ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
  • అనుమానాస్పద బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
  • సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మకుండా, అనుమానాలుంటే పోలీసులను సంప్రదించాలి.

వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించేందుకు సహకరించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారు. భక్తుల భద్రతతో పాటు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవాలు నిర్వహించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని తెలిపారు.

Leave a Reply