మహిళా పోలీసుల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించాలి: ఎస్పీ

నల్లగొండ ఈక్షణం, అక్టోబర్ 27: మహిళా పోలీసు సిబ్బందిలో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, స్వీయ అవగాహన మరియు సమర్థవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించేందుకు నిర్వహించే ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.

నల్లగొండ జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లకు ‘యుమీద్‌’ (UMEED) స్వచ్ఛంద సంస్థ సహకారంతో, తెలంగాణ పోలీస్ అకాడమీ (TGPA) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ముగింపు సమావేశానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. పోలీస్ రంగానికి ప్రజలే అత్యంత ప్రధానమని, ఏవైనా సమస్యలతో పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రతి బాధితుడికి ధైర్యం, భరోసా కల్పించడం పోలీసుల మొదటి బాధ్యత అని స్పష్టం చేశారు. ముఖ్యంగా గృహ హింస, బాలికలు, మహిళల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితుల బాధలను ఓపికగా వినాలని సూచించారు.

బాధితులు ఎలాంటి భయం, సంకోచం లేకుండా తమ సమస్యలను చెప్పుకునేలా ప్రశాంతమైన, నమ్మకమైన వాతావరణాన్ని పోలీస్ స్టేషన్లలో కల్పించాలని పిలుపునిచ్చారు.

మహిళా పోలీసులు కేవలం చట్టాన్ని అమలు చేసే వారిగానే కాకుండా, ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు సంయమనంతో వ్యవహరించడం, భావోద్వేగాలను నియంత్రించుకోవడం, సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం పోలీసు ఉద్యోగంలో అత్యంత కీలకమని చెప్పారు.

ఈ శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను తమ స్టేషన్లలోని ఇతర సిబ్బందికి కూడా వివరించి, పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం పెరిగేలా పనిచేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, టీజీపీఏ డీఎస్పీ శ్రీనివాసరావు, ‘యుమీద్‌’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రహమ్మత్ ఉన్నిసా, నందిని, కౌశికి శర్మ, హనిత, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ మంజుల, ఏహెచ్‌టీయూ (AHTU) ఎస్‌ఐ అంజలి మరియు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.