
Breaking News: రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి 6 నెలల జైలు శిక్ష..
- హైకోర్టు ధిక్కరణ కేసులో సంచలన తీర్పు..
- 4 వారాల పాటు శిక్ష అమలు నిలిపివేత!
- భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలన్న హైకోర్టు ఆదేశాల బేఖాతరు..
- జస్టిస్ కె. లక్ష్మణ్ ధర్మాసనం కీలక తీర్పు..
హైదరాబాద్ ఈక్షణం, నవంబర్ 09: న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేసిన అధికారులపై తెలంగాణ హైకోర్టు కొరడాఝుళిపించింది. కోర్టు ధిక్కరణ (Contempt of Court) కేసుకు సంబంధించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైనందుకు కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష, రూ. 2,000 జరిమానా విధించి సంచలనం సృష్టించింది. హైకోర్టు జస్టిస్ కె. లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
అసలు వివాదం ఏమిటంటే..
కొంతకాలం క్రితం తమ భూములను ప్రభుత్వ నిషేధిత ఆస్తుల జాబితా (Prohibited List) నుంచి తొలగించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు బాధితులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన న్యాయస్థానం.. పిటిషనర్ల విజ్ఞప్తిపై నిర్ణయం తీసుకుని, 60 రోజుల్లోగా వారి భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించే అంశంపై తగిన ఉత్తర్వులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.
అయితే, హైకోర్టు గడువు ముగిసినప్పటికీ కలెక్టర్ నారాయణ రెడ్డి కోర్టు ఆదేశాలను అమలు చేయలేదు. దీంతో బాధితులు తిరిగి హైకోర్టును ఆశ్రయించి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
అప్పీల్‌కు నాలుగు వారాల గడువు..
కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు కలెక్టర్ నారాయణ రెడ్డికి జైలు శిక్ష విధిస్తూనే, ఈ తీర్పుపై డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసుకునేందుకు చట్టపరమైన అవకాశం కల్పిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఈ నేపథ్యంలో అప్పీలు గడువును దృష్టిలో ఉంచుకుని శిక్ష అమలును నాలుగు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు జస్టిస్ కె. లక్ష్మణ్ వెల్లడించారు. న్యాయస్థానాల ఆదేశాలను నిర్లక్ష్యం చేసే అధికారులకు ఈ తీర్పు పెద్ద హెచ్చరికగా నిలిచింది.







