Eekshanam Exclusive: కృష్ణా జలాలపై ‘డిసెంబర్ 10’ సమరం!

నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: నాగార్జునసాగర్ కృష్ణా జలాల వివాదం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడెక్కింది. పల్నాడు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇస్తోందంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు.. డిసెంబర్ 10న నల్లగొండలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభతో మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ఈ సభకు ముందే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్‌పై ఎదురుదాడికి దిగారు. పల్నాడు వాటర్‌గ్రిడ్‌కు సంబంధించిన పనులు 2005లోనే ప్రారంభమయ్యాయని, 2022 ఫిబ్రవరి 16న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీవో నంబర్ 56 విడుదలైందని గుర్తుచేస్తూ బీఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొట్టారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ హక్కులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే నష్టం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. దీంతో డిసెంబర్ 10న జరగనున్న బీఆర్ఎస్ సభకు సీఎం వ్యాఖ్యలు ముందస్తు రాజకీయ కౌంటర్‌గా మారాయి. గతంలో ఎవరు ఏ నిర్ణయాలు తీసుకున్నారు? ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తోంది? అన్న అంశాల చుట్టూ రెండు పార్టీల మధ్య జల రాజకీయాలు సాగుతున్నాయి.

నాగార్జునసాగర్ జలాలను పల్నాడు ప్రాంతానికి తరలించే వాటర్‌గ్రిడ్ అంశం ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ పథకానికి సంబంధించిన పనులు 2005లోనే ప్రారంభమయ్యాయి. అనంతరం 2022 ఫిబ్రవరి 16న అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వాల హయాంలో జీవో నంబర్ 56 విడుదలైంది. జల్‌జీవన్ మిషన్‌లో భాగంగా పల్నాడు, గుంటూరు జిల్లాల తాగునీటి అవసరాల కోసం రూ.1,200 కోట్లతో పథకాన్ని రూపొందించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.500 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ వచ్చేలా ప్రతిపాదనలు చేపట్టారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు పనులు, నీటి తరలింపు ప్రతిపాదనలపై బీఆర్ఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. నాగార్జునసాగర్ నీటిపై తెలంగాణకు ఉన్న హక్కులు, హైదరాబాద్ తాగునీటి అవసరాలు, ఉమ్మడి నల్లగొండ జిల్లా సాగునీటి ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూడాలని డిమాండ్ చేస్తోంది.

పల్నాడు వాటర్‌గ్రిడ్‌పై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు సీఎం రేవంత్‌రెడ్డి 2022 జీవోను ప్రధాన అస్త్రంగా చేసుకున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జీవో నంబర్ 56 విడుదలైందని, అప్పట్లో ప్రాజెక్టుపై కానీ, కేంద్ర ఆర్థిక సహకారంపై కానీ కృష్ణా బోర్డు వద్ద ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని ప్రశ్నించారు. ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయాలు గత ప్రభుత్వ హయాంలోనే జరిగితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా బాధ్యురాలిని చేస్తారని నిలదీశారు. ఈ అంశం తమ ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెంటనే కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశామని, పనులు నిలిపివేయాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశారని వెల్లడించారు. బీఆర్ఎస్ తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సిన అవసరం లేదని, తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.

కేవలం పల్నాడు వాటర్‌గ్రిడ్‌కే పరిమితం కాకుండా కృష్ణా జలాల చరిత్రను సీఎం తన విమర్శల్లోకి తీసుకొచ్చారు. 2004-06 మధ్య వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యం 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచేందుకు అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. 2005 మార్చి 29న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ డిమాండ్లలోనే నీటి తరలింపు సామర్థ్యం పెంపు అంశం ఉందని, సెప్టెంబర్ 13న జీవో విడుదలైందని గుర్తుచేశారు. ఆ సమయంలో టీఆర్ఎస్‌కు చెందిన ఆరుగురు మంత్రులు వైఎస్ మంత్రివర్గంలో ఉన్నారని, అసెంబ్లీలో ఈ అంశంపై ఎందుకు అభ్యంతరం చెప్పలేదని హరీశ్‌రావును ప్రశ్నించారు. హంద్రీనీవా, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్ట్ వంటి ప్రాజెక్టుల విషయంలోనూ అప్పటి బీఆర్ఎస్ నాయకత్వం వ్యవహరించిన తీరును తప్పుబట్టారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కృష్ణా జలాల పంపకాల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం తగిన విధంగా వ్యవహరించలేదన్నది రేవంత్‌రెడ్డి ప్రధాన ఆరోపణ. 2015 జూన్ 26న కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీల చొప్పున నీటి వినియోగానికి అంగీకరించడాన్ని ఆయన తప్పుబట్టారు. తెలంగాణకు అధిక వాటా రావాల్సి ఉన్నా 299 టీఎంసీలతో సరిపెట్టుకున్నారని విమర్శించారు. 2020 జనవరి 29న కూడా ఈ పంపకాల విధానాన్ని కొనసాగించేందుకు అంగీకరించారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటి హక్కుల కోసం బలంగా వాదించే అవకాశం ఉన్నప్పటికీ కేసీఆర్, హరీశ్‌రావు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదని విమర్శించారు. ఈ నిర్ణయాల వల్లే తెలంగాణ నీటి హక్కులకు నష్టం జరిగిందని సీఎం ఆరోపిస్తున్నారు.

కృష్ణా జలాల పంపకాల విషయంలోనే కాకుండా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలోనూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఎస్ఎల్బీసీ(SLBC), కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రాజెక్టులను పూర్తి చేయలేదని విమర్శించారు. మరోవైపు ఏపీలో రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులను అక్కడి ప్రభుత్వం వేగంగా పూర్తి చేసుకుందని పేర్కొన్నారు. భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం, పునరావాసం వంటి అంశాలను గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయని అన్నారు. తమ ప్రభుత్వం భూసేకరణకు నిధులు కేటాయిస్తూ, పెండింగ్ పనుల పూర్తికి చర్యలు చేపడుతోందని వివరించారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ తెలంగాణకు నీటి నష్టం జరగడానికి గత బీఆర్ఎస్ పాలనే కారణమని సీఎం ఆరోపించారు.

ఈ రాజకీయ పోరులో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. బీఆర్ఎస్ తన భారీ బహిరంగ సభకు నల్లగొండను వేదికగా ఎంచుకోగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే జిల్లాకు చెందిన ఇద్దరు కీలక మంత్రులు ఉన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌కు, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ సాగర్ జలాల పరిరక్షణ పేరుతో జిల్లాలో సభ నిర్వహిస్తుండగా, మరోవైపు జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ వైఖరిని సమర్థించాల్సిన పరిస్థితి ఉంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తన సొంత జిల్లాలో బీఆర్ఎస్ లేవనెత్తుతున్న ప్రశ్నలకు రాజకీయంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దీంతో ఈ సభ ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లోనూ ప్రాధాన్యం సంతరించుకుంది.

మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఈ జల వివాదాన్ని జిల్లాలో పార్టీ ఉద్యమ కార్యాచరణగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పల్నాడు వాటర్‌గ్రిడ్ అంశంపై కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేయడంతో పాటు ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. డిసెంబర్ 10న నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహించి కృష్ణా జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని భావిస్తున్నారు. కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానుండటంతో రాష్ట్రస్థాయి నాయకత్వం కూడా ఈ కార్యక్రమంపై దృష్టి సారించింది. జిల్లాలో పార్టీ శ్రేణులను సమీకరించడంతో పాటు రైతాంగాన్ని పెద్ద సంఖ్యలో సభకు తీసుకురావాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా జలాల విషయంలో తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమర్థించుకోవడంతో పాటు ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు చేయడం బీఆర్ఎస్‌కు కీలకంగా మారనుంది.

ఇప్పటివరకు కృష్ణా జలాల అంశంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ వస్తోంది. అయితే సీఎం రేవంత్‌రెడ్డి గత ప్రభుత్వ హయాంలో విడుదలైన జీవోలు, నీటి పంపకాల నిర్ణయాలు, పెండింగ్ ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ ఎదురుదాడికి దిగుతున్నారు. దీంతో బీఆర్ఎస్ డిసెంబర్ 10 సభలో పల్నాడు వాటర్‌గ్రిడ్ జీవోపై ఏం సమాధానం చెబుతుంది? 2015 నీటి పంపకాల నిర్ణయాన్ని ఎలా సమర్థించుకుంటుంది? తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తుంది? అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని కేంద్రం, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది కూడా కీలకం.