Eekshanam Exclusive: ఎలినినో సెగ.. బీర్లు భగభగ

నల్లగొండ, ఈ క్షణం ప్రతినిధి: ఎండలు మండిపోతున్నాయి.. బీర్లకు గిరాకీ పెరుగుతోంది.. కానీ వైన్స్‌ షాపులకు మాత్రం సరిపడా స్టాక్‌ రావడం లేదు. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీర్ల కొరత ఏర్పడింది. ఓవైపు ఎండల ప్రభావంతో బీర్ల అమ్మకాలు జోరందుకోగా.. మరోవైపు డిస్టలరీల నుంచి డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో డిపోల్లో రేషన్‌ విధానం అమలు చేస్తున్నారు. ముఖ్యంగా రాయల్‌ చాలెంజ్‌, 5000, బడ్వైజర్‌ టిన్‌ బీర్లకు డిమాండ్‌ భారీగా పెరిగింది. దీంతో వినియోగదారులకు అవసరమైన బ్రాండ్లు అందుబాటులో ఉండటం లేదు. బీర్ల విక్రయాలు పెరుగుతున్నా.. సరఫరా మాత్రం ఆ స్థాయిలో లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు.

నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని 254 షాపులకు రోజుకు సుమారు 30 వేల బీర్ల పెట్టెలు అవసరం కాగా.. ప్రస్తుతం 11 వేల పెట్టెలు మాత్రమే సరఫరా అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదీ రోజూ కాకుండా రెండు, మూడు రోజులకోసారి వస్తుండటంతో కొరత మరింత తీవ్రమవుతోంది. ప్రస్తుత డిమాండ్‌ను బట్టి రోజుకు లక్ష పెట్టెల వరకు అవసరం ఉంటుందని, సరఫరా పరిమితంగా ఉండటంతో డిపోల వద్ద రేషన్‌ విధానంలో స్టాక్‌ కేటాయిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో డిమాండ్‌కు అనుగుణంగా షాపులకు బీర్లు అందడం లేదు. ప్రధానంగా రాయల్‌ చాలెంజ్‌ బీర్ల అమ్మకాలు గత ఐదారు నెలలుగా సుమారు 70 శాతం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ బ్రాండ్‌తో పాటు 5000, బడ్వైజర్‌ టిన్‌ బీర్లకు కూడా గిరాకీ ఎక్కువగా ఉంది. ఈ బ్రాండ్లను సంగారెడ్డి జిల్లాలోని డిస్టలరీల నుంచి సరఫరా చేయాల్సి ఉండగా.. అక్కడ నీటి కొరత కారణంగా ఉత్పత్తి తగ్గి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో మద్యం విక్రయాల తీరులోనూ మార్పు కనిపిస్తోంది. ఎండల ప్రభావంతో బీర్ల అమ్మకాలు పెరుగుతుండగా.. సాధారణ లిక్కర్‌ విక్రయాలు తగ్గుతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్‌లో బీర్ల విక్రయాలు ఏకంగా 89,905 పెట్టెలు పెరిగాయి. మరోవైపు లిక్కర్‌ విక్రయాలు 15,913 పెట్టెలు తగ్గాయి. ఉమ్మడి జిల్లాలోని 15 ఎక్సైజ్‌ స్టేషన్ల పరిధిలో ఉన్న 336 మద్యం షాపుల్లో గతేడాది సెప్టెంబర్‌లో 4,66,709 పెట్టెల బీర్లు అమ్ముడవగా.. ఈ ఏడాది అదే నెలలో 5,56,614 పెట్టెలు విక్రయమయ్యాయి. అదే సమయంలో గతేడాది 3,08,826 పెట్టెలుగా ఉన్న లిక్కర్‌ విక్రయాలు.. ఈ ఏడాది 2,92,913 పెట్టెలకు పడి పోయాయి. అంటే బీర్ల విక్రయాలు గణనీయంగా పెరిగినా.. లిక్కర్‌ అమ్మకాలు మాత్రం తగ్గుముఖం పట్టాయి.

టార్గెట్‌ రూ.415 కోట్లు.. వచ్చింది రూ.340.56 కోట్లే! బీర్ల అమ్మకాలు పెరిగినా.. లిక్కర్‌ విక్రయాలు తగ్గడంతో ఎక్సైజ్‌ శాఖ ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగలేదు. సెప్టెంబర్‌ నెలలో రూ.415 కోట్ల ఆదాయం సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఇందులో భాగంగా ప్రతి షాపు అదనంగా రూ.5 నుంచి రూ.10 లక్షల విలువైన స్టాక్‌ కొనుగోలు చేయాలని టార్గెట్ పెట్టింది. అయినప్పటికీ నిర్దేశించిన ఆదాయ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. సెప్టెంబర్‌లో రూ.340.56 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. గతేడాది సెప్టెంబర్‌లో రూ.332 కోట్ల ఆదాయం రాగా.. ఈసారి సుమారు రూ.340 కోట్లకు చేరింది. అంటే గతేడాదితో పోలిస్తే అదనంగా వచ్చిన ఆదాయం రూ.8.17 కోట్లు మాత్రమే. ఎండలతో బీర్లకు గిరాకీ పెరుగుతున్నా.. మరోవైపు లిక్కర్‌ విక్రయాలు తగ్గడం, బీర్ల సరఫరా డిమాండ్‌కు సరిపోకపోవడం ఎక్సైజ్‌ శాఖకు సవాలుగా మారింది.

Leave a Reply