Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

నల్గొండ, అక్టోబర్ 12, ఈ క్షణం: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రతిష్టాత్మక ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (Indian Red Cross Society) పాలకవర్గ ఎన్నికల్లో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇటీవల ముగిసిన డైరెక్టర్ల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని సంచలనం సృష్టించిన హేమలత వర్గం, కీలకమైన ప్రధాన పదవులన్నింటినీ కైవసం చేసుకుంది. నల్గొండ రెడ్‌క్రాస్ సొసైటీ చరిత్రలోనే తొలి మహిళా చైర్మన్‌గా డాక్టర్ హేమలత ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
నామినేషన్ల ప్రక్రియలో ప్రత్యర్థి ప్యానెల్ నుంచి ఎవరూ పోటీకి ముందుకు రాకపోవడంతో నూతన కమిటీ ఏకగ్రీవంగా కొలువుదీరింది.
రెడ్‌క్రాస్ నిబంధనల ప్రకారం నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులతో సోమవారం నిర్వహించిన కీలక సమావేశంలో ప్రధాన పదవులకు నామినేషన్ల దాఖలుకు పది నిమిషాల సమయాన్ని కేటాయించారు. ఈ పరిమిత గడువులో డాక్టర్ హేమలత ప్యానెల్ అభ్యర్థులకు పోటీగా మరెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో ఎన్నికల అధికారులు నూతన బాధ్యుల ఎంపికను అధికారికంగా ప్రకటించారు.
చైర్మన్: డాక్టర్ హేమలత (సొసైటీ చరిత్రలోనే తొలి మహిళా చైర్మన్)
వైస్ చైర్మన్: భీమనపల్లి శ్రీకాంత్
ట్రెజరర్: కుంభం జ్యోతి రెడ్డి
ఎగ్జిక్యూటివ్ సభ్యుడు: మంచుకొండ చిన్న బిక్షమయ్య
గత 12 ఏళ్లుగా కొనసాగుతున్న ఏకచక్రాధిపత్యానికి తెరపడి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నిర్వహణ ద్వారా సరికొత్త నాయకత్వం కొలువుదీరడంపై రెడ్‌క్రాస్ సభ్యులు, సేవా తత్పరులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఒక విద్యావంతురాలైన వైద్యురాలు, మహిళ రెడ్‌క్రాస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం ద్వారా నల్గొండ బ్లడ్ బ్యాంక్ నిర్వహణ, ఉచిత రక్తదాన శిబిరాలు, సమాజ సేవా కార్యక్రమాలకు నూతన ఉత్తేజం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నూతన చైర్మన్ డాక్టర్ హేమలత మాట్లాడుతూ.. ఇన్నాళ్లూ విమర్శలకు గురైన రెడ్‌క్రాస్‌లో పారదర్శకతను పునరుద్ధరించి, ఆపదలో ఉన్న ప్రతి పేదవాడికి సేవలు అందేలా పూర్తిస్థాయి సమర్థతతో పనిచేస్తామని స్పష్టం చేశారు.