
ధర్వేశిపురం ఎల్లమ్మ ఆలయానికి మహర్దశ
- రూ.15 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం.. మరో రూ.25 కోట్లు మంజూరు
- రూ.37 కోట్లతో బైపాస్ నుంచి చర్లగౌరారం వరకు రహదారి
నల్గొండ, ఈక్షణం: నల్గొండ జిల్లా కనగల్ మండలం ధర్వేశిపురం రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గురువారం ధర్వేశిపురం ఎల్లమ్మ దేవాలయం వద్ద రూ.15 కోట్ల పర్యాటక నిధులతో చేపట్టనున్న విశ్రాంతి గృహం, హరిత హోటల్, ఆలయ సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. త్వరలోనే ఆలయ అభివృద్ధికి మరో రూ.25 కోట్లు మంజూరు చేయించనున్నట్లు ప్రకటించారు.
రూ.37 కోట్లతో రహదారి అభివృద్ధి
నల్గొండ బైపాస్ నుంచి నల్గొండ–సాగర్ రోడ్డు మీదుగా మంచినీళ్లబావి, ధర్వేశిపురం, చర్లగౌరారం వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర రూ.37 కోట్లతో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మహబూబ్‌నగర్–నల్గొండ రహదారిపై మైలసముద్రం వరకు ఐదు కిలోమీటర్ల మేర రూ.21 కోట్లతో చేపట్టనున్న రోడ్డు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు.
రోడ్ల అభివృద్ధికి రూ.130 కోట్లు
ధర్వేశిపురం పరిసర ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి రూ.130 కోట్ల నిధులు మంజూరు చేసి పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే ధర్వేశిపురం రహదారి వెడల్పు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. రూ.67 కోట్లతో ఆలయ రహదారితో పాటు గ్రామంలో ఇతర రహదారులు, అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. నల్గొండ నుంచి ధర్వేశిపురం వరకు రూ.50 కోట్లతో రహదారి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. రహదారి సౌకర్యాలు మెరుగుపడితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రోడ్డు ప్రమాదాలను కూడా నివారించవచ్చని అన్నారు.
ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేపడుతున్నామని పేర్కొన్నారు. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇటీవల ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి పైగా బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ ధర్వేశిపురం ఎల్లమ్మ దేవాలయ అభివృద్ధిలో భాగంగా రూ.15 కోట్లతో చేపట్టనున్న పనులకు మంత్రి శంకుస్థాపన చేశారని తెలిపారు. రూ.37 కోట్లతో డబుల్ రోడ్డు అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో ప్రజలంతా నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో పూర్తికాని మహిళా సమాఖ్య భవనాలను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్‌రెడ్డి, నల్గొండ ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, ధర్వేశిపురం రేణుక ఎల్లమ్మ దేవాలయ చైర్మన్ వెంకటరెడ్డి, సర్పంచ్ రావుల శేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులు, ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్‌రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.







