
Eekshanam Exclusive: గ్రాడ్యుయేట్ పోరులో.. రాకేశ్‌రెడ్డి గట్టెక్కేనా?
- ఓటరు నమోదుపై బీఆర్‌ఎస్ హైకమాండ్ గురి..
- పాత జాబితాల ఆధారంగా పట్టభద్రుల అన్వేషణ..
- ఎస్‌ఐఆర్ ఇన్‌చార్జిలకే బాధ్యతలు..
- మాజీ ఎమ్మెల్యేలకు అదనపు బాధ్యతలు.. కేడర్‌లో మాత్రం నిరాసక్తత
- ‘అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు.. ఇప్పుడెందుకు కష్టపడాలి?’
- కాంగ్రెస్కు దీటుగా ఖర్చు చేస్తేనే గెలుపు ఆశలంటూ పార్టీలో చర్చ
నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం, అక్టోబర్ 23: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్ హైకమాండ్ ఓటరు నమోదుపై దృష్టి సారించింది. గతంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి పోటీ చేసినప్పుడు నమోదైన ఓటర్ల జాబితా, ఉప ఎన్నికల జాబితాలను పోల్చి పట్టభద్రులను గుర్తించాలని నిర్ణయించింది. ఇందుకోసం గతంలో ఎస్‌ఐఆర్(SIR) ప్రక్రియలో పనిచేసిన ఇన్‌చార్జిలకే బాధ్యతలు అప్పగించడంతోపాటు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకులకు అదనపు బాధ్యతలు ఇచ్చింది. అయితే క్షేత్రస్థాయిలో ఓటరు నమోదు ఆశించిన స్థాయిలో సాగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోలేదనే అసంతృప్తి కేడర్‌లో కనిపిస్తుండటంతో పార్టీ నాయకత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పాత జాబితాలతో ఓటర్ల అన్వేషణ
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి పోటీ చేసినప్పుడు సుమారు 5.30 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఉప ఎన్నికల నాటికి ఆ సంఖ్య 4.30 లక్షలకు తగ్గినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో నమోదైన ఓటర్ల జాబితాను, ఉప ఎన్నికల జాబితాను పోల్చి ప్రస్తుతం ఓటర్లుగా నమోదు చేసుకోని పట్టభద్రులను గుర్తించాలని హైకమాండ్ సూచించింది. అవసరమైతే గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి వారిని గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలని ఆదేశించింది.
ఇన్చార్జిలకు అదనపు బాధ్యతలు
ఓటరు నమోదు ప్రక్రియను పర్యవేక్షించేందుకు గతంలో ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో పనిచేసిన ఇన్‌చార్జిలనే కొనసాగించింది. వారితోపాటు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, జడ్పీ చైర్మన్లు, ఇతర సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించింది. మూడు ఉమ్మడి జిల్లాలకు అదనపు ఇన్‌చార్జిలను కూడా నియమించింది. గ్రామస్థాయిలో పట్టభద్రులను గుర్తించి, ఓటరు నమోదు చేయించే బాధ్యతలను వీరికి అప్పగించింది.
ప్రత్యేక లింక్ ద్వారా నమోదు
పార్టీ హైకమాండ్ ప్రత్యేకంగా రూపొందించిన లింక్ ద్వారా పట్టభద్రుల ఓటరు నమోదు చేయించాలని సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ లింక్ ద్వారా ఎంతమంది నమోదు చేసుకున్నారనే వివరాలను నియోజకవర్గాలవారీగా సేకరించనున్నారు. పాత ఓటర్ల జాబితాలను పరిశీలించి, ప్రస్తుతం ఓటరుగా నమోదు చేసుకోని అర్హులను గుర్తించి దరఖాస్తులు చేయించాలని నిర్ణయించారు. అయితే నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ గ్రామస్థాయిలో ఓటరు నమోదు కార్యక్రమం ఆశించినంత వేగంగా సాగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కేడర్‌లో నిరాసక్తత
పార్టీ నాయకత్వం ఓటరు నమోదుపై దృష్టి సారించాలని సూచిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎంతవరకు సహకరిస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోలేదని, అవసరమైన సమయంలో నాయకులు ఆదుకోలేదని కొందరు కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
‘అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని నాయకుల కోసం ఇప్పుడెందుకు కష్టపడాలి? ఎవరు గెలిస్తే మాకేంటి?’ అనే భావన కొందరు కార్యకర్తల్లో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ గెలిస్తే తమకు ప్రయోజనం కలుగుతుందనే నమ్మకం ఉన్నప్పుడే కార్యకర్తలు కష్టపడతారని, ప్రస్తుతం అలాంటి ఆసక్తి కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల ఖర్చులపైనా చర్చ
ఎన్నికల నిర్వహణకు పార్టీ హైకమాండ్ ఎంత ఖర్చు చేస్తుందనే అంశంపైనా చర్చ జరుగుతోంది. గత ఉప ఎన్నికల్లో పార్టీనే ఖర్చులు భరించిందని, ఈసారి కూడా అదే స్థాయిలో సహకారం అందిస్తుందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి తన పర్యటనలకు ఖర్చు చేసుకున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి దీటుగా బీఆర్‌ఎస్ ఎంత ఖర్చు చేస్తుందనే దానిపైనే గెలుపు అవకాశాలు ఆధారపడి ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గడువులోగా పూర్తయ్యేనా?
నవంబర్ 6 ఓటరు నమోదు చివరి తేదీగా పేర్కొంటున్న నేపథ్యంలో, పాత జాబితాల ఆధారంగా పట్టభద్రులను గుర్తించి నమోదు చేయించే ప్రక్రియను వేగవంతం చేయాలని హైకమాండ్ సూచించింది. అయితే నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలకే పరిమితం కాకుండా గ్రామస్థాయిలో ఓటర్లను గుర్తించి నమోదు చేయించడంపై ఇన్‌చార్జిలు దృష్టి సారించాల్సి ఉంది. ఓటరు నమోదు కార్యక్రమంలో పార్టీ కేడర్ ఏ మేరకు భాగస్వామ్యం అవుతుంది? ఎన్నికల ఖర్చులకు హైకమాండ్ ఎంతవరకు సహకరిస్తుంది? అన్న అంశాలు ప్రస్తుతం బీఆర్‌ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.







