Eekshanam Exclusive: అప్పుడే ఒడిసిపడితే.. ఇప్పుడీ తిప్పలెందుకు?

నల్గొండ, ఈ క్షణం ప్రతినిధి: వానలు కురిసినప్పుడు ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టుకోవాలి. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలను పెంచుకోవాలి. కానీ ఎండలు ముదిరి, వర్షాభావ పరిస్థితులపై ఆందోళనలు మొదలైనప్పుడే జల సంరక్షణ పనులపై హడావుడి పెరుగుతోంది. గతంలోనూ అందుబాటులో ఉన్న ఇంకుడు గుంతలు, పొలాల్లో ఫాంపాండ్లు, బోర్‌వెల్‌ రీచార్జ్‌ నిర్మాణాలు, పెర్కొలేషన్‌ ట్యాంకుల వంటి నీటి సంరక్షణ మార్గాలకు మరింత ప్రాధాన్యం ఇచ్చి ఉంటే.. నేడు భూగర్భ జలాల పరిస్థితి ఇంకాస్త మెరుగ్గా ఉండేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడవచ్చన్న ఆందోళనల నేపథ్యంలో నల్లగొండ జిల్లాలో మరోసారి జల సంరక్షణ పనులపై అధికారులు దృష్టి సారించారు. ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే ఏడాది మార్చి నాటికి 75.88 లక్షల పనిదినాలు కల్పించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. వర్షపు నీటిని వృథా కాకుండా కాపాడటంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనులు చేపట్టనున్నారు.

2026–27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 55 లక్షల పనిదినాలు కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. రానున్న కాలంలో జల సంరక్షణ పనులను విస్తృతం చేసి అదనంగా 75.88 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 2న జిల్లాలోని 868 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి నీటి సంరక్షణ పనులపై అవగాహన కల్పించారు. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మాణం, ఎండిపోయిన బోరుబావుల వద్ద రీచార్జ్‌ నిర్మాణాలు, వ్యవసాయ భూముల్లో ఫాంపాండ్లు, గ్రామాల్లో కమ్యూనిటీ సోక్‌ పిట్స్‌, ఇళ్లపై పడే వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు రూఫ్‌టాప్‌ హార్వెస్టింగ్‌ నిర్మాణాలు చేపట్టాలని ప్రతిపాదించారు. ప్రతి గ్రామంలో 15 ఫాంపాండ్లు, ఐదు కమ్యూనిటీ సోక్‌ పిట్స్‌ ఏర్పాటు చేయడంతోపాటు అవసరమైన ప్రాంతాల్లో బోర్‌వెల్‌ రీచార్జ్‌ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే గుర్తించిన పనులు పలు మండలాల్లో ప్రారంభమయ్యా యి. ప్రస్తుతం పత్తి ఏరడం, ఇతర వ్యవసాయ పనుల్లో కూలీలు నిమగ్నమై ఉండటంతో జల సంరక్షణ పనులకు ఆశించిన స్థాయిలో కూలీలు రావడం లేదని అధికారులు చెబుతున్నారు.

Nalgonda Water Conservation NREGS Jalasiri Works Farm Ponds

వర్షపు నీటితోపాటు ఇళ్ల నుంచి బయటకు వెళ్లే నీటిని కూడా సాధ్యమైనంత వరకు భూమిలోకి ఇంకించేలా నిర్మాణాలు చేపట్టడంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. నలుగురు సభ్యులున్న కుటుంబం నుంచి రోజుకు సుమారు 400 లీటర్ల నీరు వృథాగా బయటకు వెళ్తుందని అంచనా వేస్తున్నారు. ఈ నీటిని భూమిలోకి ఇంకించేందుకు ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించుకోవాలని సూచిస్తున్నారు. ఒక్కో గుంత నిర్మాణానికి రూ. 6 వేల వరకు ఖర్చవుతుందని, ఈ మొత్తాన్ని అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేసే విధానం అమల్లో ఉందని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో మురుగునీరు, వర్షపు నీరు వృథాగా బయటకు వెళ్ల కుండా కమ్యూనిటీ సోక్‌ పిట్స్‌ నిర్మించనున్నారు. ఒక్కో నిర్మాణానికి రూ. 1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వ్యయం కానుంది. భూగర్భ జలాలు తగ్గిపోయిన ప్రాంతాల్లో బోర్‌వెల్‌ రీచార్జ్‌ నిర్మాణాల ద్వారా వర్షపు నీటిని భూమిలోకి పంపేలా చర్యలు చేపట్టనున్నారు. ఒక్కో నిర్మాణానికి సుమారు రూ.60 వేల వరకు చెల్లించనున్నారు. వ్యవసాయ భూముల్లో వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు ఒక్కో ఫాంపాండ్‌కు సుమారు రూ.2 లక్షల వ్యయంతో పనులు చేపట్టాలని ప్రతిపాదించారు.

జిల్లాలో చేపడుతున్న నీటి సంరక్షణ పనులకు ప్రభుత్వం ‘జలసిరి’ గా పేరు పెట్టింది. జిల్లాలోని 868 గ్రామాల్లో రోజుకు సగటున 30 మంది కూలీలకు పని కల్పించాలనేది లక్ష్యం. ఈ లెక్కన రోజుకు 26,040 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం రోజుకు 15,094 మంది మాత్రమే పనులకు హాజరవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. లక్ష్యానికి, ప్రస్తుతం పనులకు వస్తున్న వారి సంఖ్యకు మధ్య రోజుకు 10,946 మంది తేడా ఉంది. వరి కోతలు, పత్తి ఏరడం తదితర వ్యవసాయ పనుల కారణంగా కూలీలు అందుబాటులో ఉండటం లేదని అధికారులు పేర్కొంటున్నారు. వ్యవసాయ పనులు తగ్గిన తర్వాత కూలీల లభ్యత పెరిగి, జల సంరక్షణ పనులు మరింత వేగంగా సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

“ప్రస్తుతం జిల్లాలో పత్తి ఏరే పనులు కొనసాగుతున్నాయి. అవి పూర్తికాగానే జల సంరక్షణ పనులపై మరింత దృష్టి సారిస్తాం. గ్రామాలు, మండలాల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. వచ్చే ఏడాది మార్చి నాటికి 75 లక్షలకు పైగా పనిదినాలు కల్పించాలన్నది లక్ష్యం. ఇందులో భాగంగా ఇంకుడు గుంతలు, ఫాంపాండ్లు, బోర్‌వెల్‌ రీచార్జ్‌ నిర్మాణాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రస్తుతం వ్యవసాయ పనుల కారణంగా కూలీల కొరత ఉన్నా, త్వరలోనే పనులు వేగం పెరుగుతుందని భావిస్తున్నాం”.

క్రమ సంఖ్యజల సంరక్షణ పనుల వివరాలులక్ష్యంగుర్తించినవి
1ఇంకుడు గుంతలు48,94243,574
2ఫామ్ పాండ్లు13,0203,232
3కమ్యూనిటీ సోక్ పిట్స్4,3401,278
4బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు4,3402,634
5రూఫ్‌టాప్ హార్వెస్టింగ్ నిర్మాణాలు165244
మొత్తం జల సంరక్షణ పనులు70,80750,962