తాగునీటి వృథాపై జలమండలి కొరడా.. జూబ్లీహిల్స్‌లో రూ.5 వేల జరిమానా

హైదరాబాద్ ఈ క్షణం, అక్టోబర్ 29: నగరంలో తాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు హైదరాబాద్ జలమండలి (HMWSSB) మరింత దూకుడు పెంచింది. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను తక్షణమే పరిగణలోకి తీసుకుంటూ, క్షేత్రస్థాయిలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. తాజాగా జూబ్లీహిల్స్ పరిధిలో తాగునీటిని వృథా చేసిన ఒక నివాస యజమానికి అధికారులు రూ. 5,000 జరిమానా విధించారు.

నగరంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు వాటర్ బోర్డు చేపట్టిన ఈ నిఘా చర్యలు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి.

జూబ్లీహిల్స్ సర్కిల్, జూబ్లీహిల్స్ వార్డు పరిధిలోని రోడ్ నంబర్ 57, ప్లాట్ నంబర్ 1152 నివాసంలో తాగునీటిని ఇంటి ప్రాంగణం శుభ్రపరిచేందుకు వృథాగా వినియోగిస్తున్నట్లు స్థానికులు జలమండలి అధికారిక వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందిդిన వెంటనే అప్రమత్తమైన జలమండలి అధికారులు హుటాహుటిన క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. అక్కడ తాగునీటి దుర్వినియోగం జరుగుతున్నట్లు స్పష్టంగా నిర్ధారించుకున్న అధికారులు, నిబంధనలను ఉల్లంఘించిన సంబంధిత నివాసానికి రూ. 5 వేల చలానా జారీ చేశారు.

తాగునీటిని తాగడానికి మరియు గృహ అవసరాలకు మాత్రమే పొదుపుగా వినియోగించాలని అధికారులు స్పష్టం చేశారు. రోడ్లు కడగడం, కార్లు కడగడం మరియు ప్రాంగణాలు శుభ్రం చేయడం వంటి పనులకు తాగునీటిని వృథా చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నగరంలో ఎక్కడైనా తాగునీరు వృథా అవుతున్నట్లు కనిపిస్తే, బాధ్యుల వివరాలు, ఫొటోలు లేదా వీడియోలతో కూడిన సమాచారాన్ని జలమండలి వాట్సాప్ నంబర్ 99499 30003 లేదా కస్టమర్ కేర్ 155313 ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జలమండలి విజ్ఞప్తి చేసింది.