హైదరాబాద్ ఎమ్మెల్సీ టికెట్ జర్నలిస్ట్ ఆకాశ్ కొల్లూరుకే..

హైదరాబాద్ ఈక్షణం, అక్టోబర్ 30: రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ (Graduates MLC) ఎన్నికల రేసులో తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి తమ పార్టీ అభ్యర్థిగా సీనియర్ జర్నలిస్ట్ ఆకాశ్ కొల్లూరును పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత అధికారికంగా ప్రకటించారు.

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఎమ్మెల్సీ స్థానం నుంచి బిసి అభ్యర్థి నలమాస శ్రీకాంత్ గౌడ్‌కు అవకాశం కల్పించిన కవిత, ఇప్పుడు రెండవ స్థానమైన హైదరాబాద్‌లోనూ బీసీ వర్గానికి చెందిన అభ్యర్థినే ఖరారు చేయడం విశేషం.

హైదరాబాద్ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా ఎంపికైన ఆకాశ్ కొల్లూరు పక్కా హైదరాబాద్ వాసి. ఆయన నేషనల్ మీడియా రంగంలో దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రధాన్యత కలిగిన జర్నలిస్టుగా సేవలు అందించారు. ఇండియా టుడే, రిపబ్లిక్ టీవీ, సీఎన్ఎన్ న్యూస్ 18, డెయిలీ హంట్ లాంటి దిగ్గజ మీడియా సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

బేగంపేటలోని ప్రతిష్టాత్మక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS)లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆకాశ్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు.

  • హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి: ఆకాశ్ కొల్లూరు (సీనియర్ జర్నలిస్ట్, బీసీ వర్గం).
  • ఎన్నికల అబ్జర్వర్ & కో-ఆర్డినేటర్: డాక్టర్ చిట్నేని రఘు.
  • స్ట్రాటజీ & వార్ రూమ్ ఇన్ ఛార్జి: ప్రముఖ న్యాయవాది రామ్ కల్యాణ్ చల్లా.
  • వరంగల్-ఖమ్మం-నల్గొండ అభ్యర్థి: నలమాస శ్రీకాంత్ గౌడ్ (బీసీ నేత).

హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి అబ్జర్వర్ మరియు కో-ఆర్డినేటర్‌గా పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చిట్నేని రఘును నియమించారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎలక్షన్ స్ట్రాటజీ మరియు వార్ రూమ్ ఇన్ ఛార్జిగా ప్రముఖ న్యాయవాది రామ్ కల్యాణ్ చల్లా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఎన్నికల ప్రచారం మరియు క్షేత్రస్థాయి సమన్వయం కోసం ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్‌చార్జులను కూడా పార్టీ నియమించింది:

  • హైదరాబాద్: సురభి, మతీన్, బండారి మహేందర్ ముదిరాజ్
  • రంగారెడ్డి: అర్చనా సేనాపతి
  • మహబూబ్ నగర్: రంజిత్ గొంగళ్ల
  • నల్గొండ: సుజిత్
  • ఖమ్మం: గట్టు కరుణ
  • వరంగల్: మాడుగుల రాజిరెడ్డి

రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీసీ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తెలంగాణ రక్షణ సేన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు స్పష్టమవుతోంది.