జర్నలిస్ట్ కుటుంబానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్ ఈక్షణం, అక్టోబర్ 29: కష్టకాలంలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన నాయకుడి లక్షణమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి నిరూపించారు. గతంలో తాను ఇచ్చిన మాట ప్రకారం, దివంగత ‘ఈనాడు’ జర్నలిస్ట్ దత్తురెడ్డి భార్య ప్రియాంకకు ఉద్యోగ అవకాశం కల్పించి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు.

మంత్రి తీసుకున్న ఈ నిర్ణయంపట్ల జర్నలిస్ట్ వర్గాల నుంచి మరియు మృతుడి కుటుంబ సభ్యుల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

గతేడాది ‘ఈనాడు’ జర్నలిస్ట్ దత్తురెడ్డి అకస్మాత్తుగా గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో చిక్కుకుంది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వయంగా కామారెడ్డి జిల్లాలోని దత్తురెడ్డి స్వగ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ క్లిష్ట సమయంలో కుటుంబానికి ధైర్యం చెప్పడమే కాకుండా, తక్షణ ఆర్థిక సహాయంగా రూ. 4 లక్షలను అందజేశారు.

అంతటితో సరిపెట్టకుండా ఆ కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా ఉంటానని, దత్తురెడ్డి భార్య ప్రియాంక అర్హతను బట్టి తన శాఖ పరిధిలో ఉద్యోగం కల్పిస్తానని నాడు ఘనంగా హామీ ఇచ్చారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నతాధికారులతో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. తాజాగా ప్రియాంకకు సంగారెడ్డిలోని న్యాక్ (NAC) సంస్థలో అసిస్టెంట్ ఇన్‌స్ట్రక్టర్‌గా ఉద్యోగ అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. కేవలం ఉద్యోగం ఇవ్వడమే కాకుండా, భవిష్యత్తులో ఆ ఉద్యోగాన్ని క్రమబద్ధీకరించేందుకు (పర్మినెంట్ చేసేందుకు) అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

తమ కష్టకాలంలో కుటుంబానికి పెద్ద దిక్కులా నిలిచి, ఇచ్చిన హామీని తూచా తప్పకుండా నెరవేర్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ప్రియాంకతో పాటు కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఒక జర్నలిస్ట్ కుటుంబం పట్ల మంత్రి చూపిన చొరవ, మానవత్వం ఎంతో స్ఫూర్తిదాయకమని పలువురు జర్నలిస్ట్ సంఘాల నాయకులు కొనియాడారు.