ఎండిన వరి, వాడిన పత్తి.. ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే ఫైర్..

టేక్మాల్ / మెదక్ ఈక్షణం, అక్టోబర్ 29: ఎల్‌నినో హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వ ముందస్తు వైఫల్యం వల్లే సింగూర్ ప్రాజెక్ట్ నుంచి 22 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేశారని, దీనివల్లనే ఆందోల్ నియోజకవర్గ రైతాంయం కరువు కోరల్లో చిక్కుకుందని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం టేక్మాల్ మండల పరిధిలోని కుసంగి, దన్నారం, కోరంపల్లి, పాల్వంచ, బర్దీపూర్ గ్రామాల్లో విద్యుత్ లేక ఎండిన వరి పైర్లను, వర్షాభావంతో దిగుబడి తగ్గిన పత్తి చేన్లను ఆయన పరిశీలించారు.

అధికారులలాగా కార్లలో కాకుండా, స్వయంగా బైక్‌పై వందలాది ఎకరాల పంట పొలాల మధ్య తిరుగుతూ క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేశారు. పొలాల మధ్య రైతులతో కూర్చుని వారి కష్టాలను అడిగి తెలుసుకుని ఓదార్చారు.

ఈ సందర్భంగా చంటి క్రాంతి కిరణ్ మీడియాతో మాట్లాడుతూ.. శాస్త్రవేత్తలు రెండేళ్లుగా ఎల్‌నినో విపత్తు గురించి హెచ్చరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వీడలేదని మండిపడ్డారు. సింగూరు నుంచి 22 టీఎంసీల నీటిని వదిలేయడం వల్ల నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు నిండే అవకాశం కోల్పోయామని, స్థానిక మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని పూర్తిగా గాలికొదిలేశారని ఆరోపించారు. నీళ్లు లేక, కరెంట్ రాక చేతికందిన పంట కళ్లముందే మాడిపోతుంటే రైతుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించడం లేదా అని ప్రశ్నించారు.

క్షేత్రస్థాయిలో రైతుల దుస్థితి అత్యంత దయనీయంగా మారిందని క్రాంతి కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి ఎకరాకు రూ. 60,000 పెట్టుబడి పెడితే, కనీసం రూ. 10,000 కూడా చేతికి రాని పరిస్థితి నెలకొందని వాపోయారు. స్థానిక రైతులు కిష్టయ్య, శంకరయ్య, విట్టల్, మానెమ్మ తదితరులు తమ ఆవేదనను చెప్పుకుని రోదించారని తెలిపారు. ఆశతో నీళ్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నవారు, పంటపై ఆశ వదులుకుని పశువులను చేన్లలోకి వదిలి మేపుతున్న దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Chanti Kranthi Kiran Tekmal Dried Crops Drought Demand Medak

బీఆర్ఎస్ చేసిన పోరాటాల వల్ల ప్రభుత్వం కొన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ, తీవ్రంగా నష్టపోయిన టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడు మండలాలను విస్మరించడం ద్రోహమని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే తన పక్షపాత వైఖరిని వీడి ఈ మండలాలను కూడా కరువు జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. వరి, పత్తి పంటలు నష్టపోయిన ప్రతి రైతుకూ ఎకరాకు తగిన నష్టపరిహారాన్ని నేరుగా అందించాలని, రైతులపై ఉన్న పంట పెట్టుబడి రుణాలను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వీరన్న, సొసైటీ అధ్యక్షుడు యశ్వంత్ రెడ్డి, మాజీ ఎంపీపీ రవి, మైనార్టీ నాయకుడు సలీం, సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ఆయా గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.