Video: సంవత్సరం లోపల కేసీఆర్ రాబోతున్నారు: కేటీఆర్

హైదరాబాద్ ఈక్షణం, నవంబర్ 04: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఏడాది లోపల కూలిపోతుందని, మళ్లీ కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రాబోతోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతున్న భూదందాలు, అక్రమాలకు భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యంగా ‘హిల్ట్ పీ’ (HLTP) స్కాంలో భాగంగా రేవంత్ రెడ్డి వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి ఎవరైనా పారశ్రామికవేత్తలు భూములు కొనుగోలు చేస్తే, భవిష్యత్తులో వాటిని తీవ్రంగా తిరిగి అనుభవిస్తారని ఘాటుగా హెచ్చరించారు.

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉన్న సుమారు 550 ఎకరాల భూములను తాము అధికారంలోకి రాగానే అమ్మేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, దమ్ముంటే ఆ భూములను పేదలకు, ఉద్యమకారులకు కేటాయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

మియాపూర్‌లోని ఆ విలువైన 500 పైచిలుకు ఎకరాల భూమిని కమర్షియల్ అవసరాల కోసం అమ్ముకోవాలని చూస్తే ఊరుకోబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. నిజంగా పేదలపై చిత్తశుద్ధి ఉంటే ఆ భూముల్లో 200 ఎకరాలను నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా పంచాలని, 100 ఎకరాలను తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, మరో 100 ఎకరాలను ఉద్యమకారులకు కేటాయించాలని సవాల్ విసిరారు. మిగిలిన భూమిలో విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశలాలు, కాలేజీలు నిర్మిస్తే తాము కూడా ప్రభుత్వాన్ని గొప్పగా స్వాగతిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన పేరుతో అరాచకాలు, భూకబ్జాలు పెరిగిపోయాయని, వాటికి రోజులు దగ్గరపడ్డాయని కేటీఆర్ మండిపడ్డారు.