Eekshanam Exclusive: డీలిమిటేషన్‌.. నేతల సీట్లకు ఎసరు?

నల్లగొండ, ఈక్షణం ప్రతినిధి: నియోజకవర్గాల పునర్విభజనపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. కొత్త ఏడాది ఆరంభంలోనే డీలిమిటేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందనే ఊహాగానాల నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చోటుచేసుకునే రాజకీయ పరిణామాలపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో నియోజకవర్గాల రిజర్వేషన్లలో మార్పులు జరిగితే కీలక నేతల రాజకీయ స్థానాలు తారుమారయ్యే అవకాశాలున్నాయనే చర్చ ప్రధాన పార్టీల్లో జోరందుకుంది. రాజకీయ విశ్లేషకులు సైతం భవిష్యత్‌ సమీకరణాలపై భిన్నమైన అంచనాలు వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాల పునర్విభజన తర్వాత నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పడిన సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి మాత్రమే ప్రస్తుతం ఎస్సీలకు రిజర్వు అయింది. సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌ జనరల్‌ స్థానాలుగా ఉన్నాయి. కోదాడ నుంచి మహిళా ఎమ్మెల్యే పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. సూర్యాపేట, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో సీనియర్‌ నేతలు ఉత్త మ్‌కుమార్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డిల రాజకీయ ఆధిపత్యం కొనసాగుతోంది. భవిష్యత్తులో మహిళా రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్లలో మార్పులు చోటుచేసుకుంటే ఈ మూడు నియోజకవర్గాల రాజకీయ ముఖచిత్రం మారవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి.

రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈసారి కోదాడ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు అయ్యే అవకాశాలున్నాయనే చర్చ నడుస్తోంది. గతంలో సూర్యాపేట ఎస్సీ రిజర్వుడు స్థానంగా ఉండగా.. గత పునర్విభజనలో అది జనరల్‌గా మారి తుంగతుర్తి ఎస్సీలకు కేటాయించారు. ఈ నేపథ్యంలో రాబోయే పునర్విభజనలో కోదాడకు ఎస్సీ రిజర్వేషన్‌ వర్తించవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పష్టత లేదు.

మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల రిజర్వేషన్ల మార్పులు జరిగితే సూర్యాపేట జిల్లా రాజకీయాల్లో కీలక మార్పులు తప్పకపోవచ్చనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా సీనియర్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తి నెలకొంది. గత రెండేళ్లుగా ఆయన తుంగతుర్తి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఆయన సొంత గ్రామం కూడా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోనే ఉండటం, రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చేతుల మీదుగా అక్కడి నుంచే ప్రారంభించడం వంటి పరిణామాలను ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. అయితే తుంగతుర్తి నుంచి పోటీ చేసే ఉద్దేశం లేదని ఉత్తమ్‌ ఇటీవల స్పష్టం చేశారు. రిజర్వేషన్ల కారణంగా రాజకీయ సమీకరణాలు మారితే ఆయన తదుపరి అడుగు ఎటువైపు ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత జగదీశ్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తుపైనా చర్చ జరుగుతోంది. సూర్యాపేట నుంచి వరుసగా మూడు సార్లు విజయం సాధించిన ఆయన ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా కొనసాగుతున్నారు. పదేళ్లపాటు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న జగదీశ్‌రెడ్డి.. భవిష్యత్తులో నల్లగొండ జిల్లా కేంద్రంగా రాజకీయంగా మరింత చురుకైన పాత్ర పోషిస్తారనే అభిప్రాయాలు పార్టీలో వినిపిస్తున్నాయి. సూర్యాపేటలో తన రాజకీయ పట్టును కొనసాగిస్తారా? లేదంటే నల్లగొండ జిల్లా రాజకీయాల్లోకి అడుగుపెడతారా? అన్నది ప్రస్తుత చర్చకు కేంద్రబిందువుగా మారింది.

మహిళా రిజర్వేషన్‌ కారణంగా హుజూర్‌నగర్‌ నియోజకవర్గం మహిళలకు కేటాయిస్తే కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చే అవకాశముంది. ప్రస్తుతం కోదాడ ఎమ్మెల్యేగా ఉన్న పద్మావతి భవిష్యత్తులో హుజూర్‌నగర్‌ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. గతంలో హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో ఆమె ఓటమి పాలైన నేపథ్యంలో ఈ నియోజకవర్గంపై మరోసారి ఆమె పేరు చర్చకు వస్తోంది. అదే జరిగితే ఉత్తమ్‌ కుటుంబ రాజకీయ ప్రాతినిధ్యంలోనూ మార్పులు చోటుచేసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కోదాడ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు స్థానంగా మారితే బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌కు అవకాశం దక్కవచ్చనే ప్రచారం సాగుతోంది. అయితే ఆయన దృష్టి నల్లగొండ నియోజకవర్గంపైనే ఉందనే మరో వాదన కూడా వినిపిస్తోంది. నల్లగొండ ఎస్సీ రిజర్వుడు స్థానంగా మారితే అక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తంగా నియోజకవర్గాల పునర్విభజనపై అధికారిక నిర్ణయాలు వెలువడకముందే సాగుతున్న ఈ రాజకీయ చర్చలు ప్రధాన పార్టీల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తుది పునర్విభజన, రిజర్వేషన్ల కేటాయింపులు ఎలా ఉంటాయన్నదానిపైనే నేతల భవిష్యత్‌ రాజకీయ వ్యూహాలు ఆధారపడి ఉండనున్నాయి.