
ఇంట్లో పని చేస్తేనే జీతాలిస్తారా.?
- హుజూర్నగర్ మున్సిపల్ కమిషనర్ తీరుపై కామాటీల తీవ్ర ఆగ్రహం..
- 3 నెలలుగా జీతాలు బంద్!
- రూ. 30 లక్షల పీఎఫ్ బకాయిలు కూడా చెల్లించలేదని ఆవేదన..
- ఇంట్లో పనిచేయాలని ఒత్తిడి తెస్తున్నారని అధికారులపై కార్మికుల ఆరోపణలు!
హుజూర్నగర్ ఈక్షణం, నవంబర్ 10: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీలో అధికారుల తీరుపై పారిశుద్ధ్య కామాటీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన హక్కుల కోసం అధికారులను నిలదీస్తే.. అధికారులు మాత్రం వ్యక్తిగత పనులు చేయాలంటూ తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత మూడు నెలలుగా తమకు జీతభత్యాలు చెల్లించడం లేదని, జీతాల బకాయిల గురించి అడిగితే కమిషనర్ దారుణమైన షరతులు విధిస్తున్నారని వారు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.
‘ఇంట్లో పని చేస్తేనే జీతాలు ఇస్తాం..’
మున్సిపల్ కమిషనర్ తమ వ్యక్తిగత ఇళ్లలో పనిచేస్తేనే ప్రతి నెలా జీతభత్యాలు మంజూరు చేస్తామని చెబుతున్నట్లు కామాటీలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గతంలో పనిచేసిన అధికారుల హయాంలో ఇలాంటి వేధింపులు లేవని, ప్రతి నెలా సమయానికే వేతనాలు అందేవని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుత అధికారుల వ్యవహార శైలి వల్ల తమ శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదని వాపోతున్నారు.
రూ. 30 లక్షల పీఎఫ్ బకాయిలు ఏమైనట్లు.?
గత మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, అప్పులు చేసి కాలం వెళ్లదీస్తున్నామని కామాటీలు కన్నీటిపర్యంతమవుతున్నారు. మరోవైపు పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించాల్సిన సుమారు రూ. 30 లక్షల పీఎఫ్ (PF) బకాయిలను కూడా మున్సిపాలిటీ అధికారులు ఇప్పటివరకు జమ చేయలేదని విమర్శిస్తున్నారు. పట్టణ పారిశుద్ధ్యాన్ని నిరంతరం కాపాడే తమకే న్యాయం జరగకపోతే, ఉన్నతాధికారులు ఎవరికి న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, పెండింగ్ జీతభత్యాలు, పీఎఫ్ బకాయిలు మంజూరు చేయడంతో పాటు కార్మికులపై జరుగుతున్న వ్యక్తిగత ఒత్తిళ్లపై విచారణ చేపట్టాలని హుజూర్నగర్ కామాటీలు డిమాండ్ చేస్తున్నారు.







