డీలిమిటేషన్‌తో దక్షిణాదికి నష్టం.. తెలంగాణ వాటాపై రాజీ లేదు: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్ ఈక్షణం, నవంబర్ 29: ‘ది హిందూ హడిల్ తెలంగాణ 2026’ వేదికగా రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధి నమూనా, పెట్టుబడుల ఆకర్షణ, వాతావరణ మార్పుల సవాళ్లు, డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లు, ఓటర్ల జాబితా తొలగింపులు వంటి అంశాలపై ఆయన స్పష్టమైన అభిప్రాయాలు పంచుకున్నారు. అనంతరం హాజరైన వారు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.

హైదరాబాద్ ప్రత్యేకత & వికేంద్రీకరణ: హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన వ్యక్తిగా నగర బహుళ సంస్కృతి, అనుకూల వాతావరణం, మెరుగైన శాంతిభద్రతలు, మౌలిక సదుపాయాలు పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయని ఉత్తమ్ తెలిపారు. పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో అభివృద్ధిని కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా వరంగల్, కరీంనగర్, నల్గొండ వంటి ప్రాంతాలకు వికేంద్రీకరిస్తున్నట్లు చెప్పారు.

ఎల్ నినో సవాలు & గ్రీన్ ఎనర్జీ: ఎల్ నినో (El Nino) ప్రభావాలను ఎదుర్కొనేందుకు నీటి వనరులను కాపాడటంతో పాటు సుమారు రెండేళ్లకు సరిపడా ఆహార ధాన్యాల బఫర్ స్టాక్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీ కాలుష్య పరిస్థితుల దృష్ట్యా 3,000 ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడం, డీజిల్-పెట్రోల్ ఆటోల స్థానంలో ఈవీ (EV) ప్రోత్సాహకాలు, 6,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ టెండర్ల ద్వారా నెట్-జీరో దిశగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు.

సంక్షేమం & ఆర్థిక క్రమశిక్షణ: 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ. 69,000 కోట్లుగా ఉన్న అప్పు, డిసెంబర్ 2023 నాటికి దాదాపు రూ. 8 లక్షల కోట్లకు చేరినప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. సుమారు 85 శాతం జనాభాకు 6 కిలోల సన్నబియ్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ, రాష్ట్రవ్యాప్తంగా హ్యామ్ (HAM) విధానంలో రోడ్ల అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు.

డీలిమిటేషన్ & దక్షిణాది వాదన: 2027లో నియోజకవర్గాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కలను ఎందుకు వాడుతున్నారో ప్రశ్నించిన ఉత్తమ్.. అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50 శాతం సీట్లు పెంచినా పార్లమెంట్‌లో ఓటింగ్ సంఖ్యాపరంగా జరుగుతుందని, దీనివల్ల ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు పెరిగి దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యపరంగా నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయాలపై న్యాయపరమైన పరిష్కారం లేకపోవడం ప్రమాదకరమని, తెలంగాణలో సుమారు 73.18 లక్షల ఓటర్ల తొలగింపు ఆందోళనకరమని వ్యాఖ్యానించారు.

మంత్రి ఉత్తమ్: దేశంలోనే తొలిసారిగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి, ఆయా రంగాల నిపుణులతోనే సిలబస్ రూపొందిస్తున్నట్లు ఉత్తమ్ చెప్పారు. సాధారణ విశ్వవిద్యాలయాల్లోనూ మౌలిక సదుపాయాలు, బోధనా నాణ్యత, కంటెంట్ మెరుగుదలపై ముఖ్యమంత్రి, విద్యాశాఖ నిరంతరం పనిచేస్తున్నాయని, వివరంగా చర్చించేందుకు ఎప్పుడైనా కలవవచ్చని సూచించారు.

మంత్రి ఉత్తమ్: ఆత్మహత్యల నివారణ అవగాహన కోసం 104, టెలి-మానస్ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు,. ఈ అంశంపై లిఖితపూర్వకంగా లేఖ ఇస్తే అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మంత్రి ఉత్తమ్: యువత సమస్యలు, అంశాలపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.

మంత్రి ఉత్తమ్: హైదరాబాద్, తెలంగాణకు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs) పెద్దఎత్తున వస్తున్నాయని ఉత్తమ్ తెలిపారు. స్కిల్ యూనివర్సిటీతో పాటు టాటా గ్రూప్ సహకారంతో సుమారు 100 నియోజకవర్గాల్లో అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, యువతకు ఉద్యోగావకాశాలు లభించేలా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు,.

మంత్రి ఉత్తమ్: ఖర్చు చేసిన నిధుల కంటే వ్యవసాయం, పరిశ్రమలు, తాగునీటి కోసం ఎంత నీటిని అందుబాటులోకి తెచ్చామన్నదే కొలమానమని ఉత్తమ్ స్పష్టం చేశారు,. నిధులు సక్రమంగా వినియోగమయ్యేలా, కొత్త ఆయకట్టుకు నీరు అందేలా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు,.

మంత్రి ఉత్తమ్: డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరిగే తెలంగాణ గ్లోబల్ సమిట్‌లో భాగంగా పలు రంగాలను పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) కోసం తెరిచామని, రంగాల వారీగా విధానాలు తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు.

మంత్రి ఉత్తమ్: తెలంగాణలో భావ ప్రకటనా స్వేచ్ఛకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ప్రతి పౌరుడి రాజ్యాంగ హక్కులను కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉత్తమ్ స్పష్టం చేశారు.

మంత్రి ఉత్తమ్: గతంలో అధిక వడ్డీ, స్వల్పకాలిక రుణాల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారం పడిందని, తమ ప్రభుత్వం లోన్ స్వాప్ (Loan swap) ద్వారా తక్కువ వడ్డీ, దీర్ఘకాలిక రుణాల వైపు వెళ్లి చెల్లింపులను సులభతరం చేసిందని మంత్రి వివరించారు.