Eekshanam Exclusive: గ్రాడ్యుయేట్‌ ఓటర్లు 6.70 లక్షలు!

నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024లో జరిగిన ఉప ఎన్నికలతో పోలిస్తే తాజాగా 2,06,568 మంది ఓటర్లు అదనంగా నమోదయ్యారు. దీంతో మొత్తం ఓటర్ల సంఖ్య 6,70,4 07కు చేరింది. ఓటర్ల సంఖ్యలో భారీ పెరుగుదల రాజకీయ పార్టీల్లో ఆసక్తితో పాటు గుబులు రేపుతోంది. కొత్తగా నమోదైన గ్రాడ్యుయేట్‌ ఓటర్లు ఎవరికి మద్దతుగా నిలుస్తారన్నది పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. 2021లో జరిగిన గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5,05,565 మంది ఓటర్లు నమోదు కాగా, 2024లో జరిగిన ఉప ఎన్నికల నాటికి ఆ సంఖ్య 4,63,839కు తగ్గింది. తాజాగా మాత్రం 6,70,407కు చేరింది. ఉప ఎన్నికలతో పోలిస్తే 2,06,568 మంది పెరగడం గమనార్హం.

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో పేర్ల నమోదుకు వచ్చిన దరఖాస్తుల పరిశీలనలో భారీ సంఖ్యలో పెండింగ్‌ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 12 జిల్లాల పరిధిలోని 192 మండలాల నుంచి మొత్తం 6,70,407 దరఖాస్తులు రాగా.. ఇప్పటివరకు 3,66,862 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అంటే వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 54.7 శాతం ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇప్పటివరకు 2,89,148 దరఖాస్తులు ఆమోదించగా, 14,396 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఆమోదం, తిరస్కరణ కలిపి 3,03,544 దరఖాస్తులపై నిర్ణయం వెలువడింది. నవంబర్‌ 10 నాటి గ్రాడ్యుయేట్స్‌ ఈఆర్‌ఓ జిల్లా వారీ డ్యాష్‌బోర్డ్‌ గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

మొత్తం 6,70,407 దరఖాస్తుల్లో 6,69,581 ఆన్‌లైన్‌ ద్వారా రాగా, కేవలం 826 దరఖాస్తులు మాత్రమే ఆఫ్‌లైన్‌లో అందాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తుల్లో 2,88,414 ఆమోదం పొందగా, 14,384 తిరస్కరణకు గురయ్యాయి. మరో 3,66,782 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆఫ్‌లైన్‌ ద్వారా వచ్చిన 826 దరఖాస్తుల్లో 734 ఆమోదించగా, 12 తిరస్కరించారు. మరో 80 పెండింగ్‌లో ఉన్నాయి.

జిల్లాల వారీగా చూస్తే నల్లగొండ జిల్లా 1,14,463 దరఖాస్తులతో మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో 1,14,416 ఆన్‌లైన్‌, 47 ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు ఉన్నాయి. 74,676 దరఖాస్తులు ఆమోదం పొందగా, 3,250 తిరస్కరణకు గురయ్యాయి. మరో 36,537 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 33 మండలాల పరిధిలో అత్యధిక దరఖాస్తులు రావడం గమనార్హం. ఖమ్మం జిల్లా 1,09,952 దరఖాస్తులతో రెండో స్థానంలో ఉంది. సూర్యాపేట జిల్లాలో 74,026, హనుమకొండలో 68,070, వరంగల్‌లో 66,824, భద్రాద్రిలో 57, 372, మహబూబాబాద్‌లో 53,802, యాదాద్రి భువనగిరిలో 49,858, జనగామలో 35,398, జయశంకర్‌ భూపాలపల్లిలో 17,918, ములుగులో 15,362 దరఖాస్తులు వచ్చాయి. సిద్దిపేట జిల్లాలో అత్యల్పంగా 7,362 దరఖాస్తులు నమోదయ్యాయి.

పెండింగ్‌ దరఖాస్తుల విషయానికి వస్తే ఖమ్మం జిల్లా 58,770తో మొదటి స్థానంలో ఉంది. వరంగల్‌లో 50,144, హనుమకొండలో 48,142, సూర్యాపేటలో 43,284, భద్రాద్రిలో 37,351, నల్లగొండలో 36,537, యాదాద్రి భువనగిరిలో 32,453, మహబూబాబాద్‌లో 19,716, జనగామలో 19,615, జయశంకర్‌ భూపాలపల్లిలో 10,548, ములుగులో 8,201, సిద్దిపేటలో 2,101 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యల్పంగా సిద్దిపేటలోనే పెండింగ్‌ దరఖాస్తులు ఉండటం విశేషం.

గ్రాడ్యుయేట్‌ ఓటరు నమోదు ప్రక్రియకు ఎన్నికల సంఘం ఈ నెల 6వ తేదీని కటాఫ్‌ తేదీగా ప్రకటించింది. ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ నిలిపివేశారు. అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ఈ నెల 25న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. అప్పటి నుంచి డిసెంబర్‌ 10వ తేదీ వరకు జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. డిసెంబర్‌ 25 నాటికి వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిష్కరించి, అదే నెల 30న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు.

డిసెంబర్‌ 30న తుది ఓటరు జాబితా ప్రకటించిన తర్వాత కూడా ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే వరకు కొత్త దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆ తర్వాత నమోదయ్యే ఓటర్లను డిసెంబర్‌ 30న ప్రకటించిన తుది జాబితాకు అదనంగా మరో జాబితాలో చేర్చనున్నారు. దీంతో ఎన్నికల నోటిఫికేషన్‌ నాటికి గ్రాడ్యుయేట్‌ ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే భారీగా పెరిగిన ఓటర్ల సంఖ్య నేపథ్యంలో కొత్త ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారన్న అంశంపై రాజకీయ పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి.

జిల్లా పేరుమొత్తం దరఖాస్తులుపెండింగ్ దరఖాస్తులు
నల్లగొండ1,14,46336,537
ఖమ్మం1,09,95258,770
సూర్యాపేట74,02643,284
హనుమకొండ68,07048,142
వరంగల్66,82450,144
భద్రాద్రి కొత్తగూడెం57,37237,351
మహబూబాబాద్53,80219,716
యాదాద్రి భువనగిరి49,85832,453
జనగామ35,39819,615
జయశంకర్ భూపాలపల్లి17,91810,548
ములుగు15,3628,201
సిద్ధిపేట7,3622,101
మొత్తం6,70,4073,66,862