
Eekshanam Exclusive: నామినేటెడ్ పోస్టులపై మళ్లీ ఆశలు!
- ఈ నెలాఖరులోగా భర్తీకి కసరత్తు..
- పాతవారికి రెన్యువల్.. కొత్త ముఖాలకు అవకాశం
- ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడిన నేతలకు ప్రాధాన్యం..
- నియోజకవర్గాల్లో పట్టున్న నాయకులకే పెద్దపీట
- సామాజిక సమీకరణాలు, మంత్రులు–ఎమ్మెల్యేల సిఫారసులే కీలకం!
నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్న ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న కార్పొరేషన్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్ పోస్టుల భర్తీకి ఈ నెలాఖరులోగా అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయనే సంకేతా లు వెలువడుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి సందీప్ నియామకంతో పదవుల పంపకాల ప్రక్రియ మరోసారి తెరపైకి రావడం పార్టీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన జాబితా ఈసారి కొలిక్కి వస్తుందనే ఆశాభావం ఆశావహుల్లో వ్యక్తమవుతోంది.
మూడేళ్ల పాలన.. మిగిలింది రెండేళ్లే!
మీనాక్షి నటరాజన్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న టైంలోనే నామినేటెడ్ పదవుల ఎంపిక ప్రక్రియ దాదాపు తుది దశకు చేరినట్లు ప్రచారం జరిగింది. అయితే ప్రభుత్వానికి, పార్టీకి మధ్య పేర్ల ఎంపికపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రకటన వాయిదా పడుతూ వచ్చింది. వచ్చే నెలతో కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకోనుంది. దీంతో మిగిలిన రెండేళ్ల కాలాన్నైనా పదవుల్లో కొనసాగాలనే ఆశావహుల ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులోగా భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలనే దిశగా పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
పాతవారికి కొనసాగింపు.. కొత్తవారికి అవకాశం!
ఈసారి పదవుల పంపకంలో గతంలో అవకాశం దక్కించుకున్నవారిలో పనితీరు, పార్టీకి అందించిన సేవలను బట్టి కొందరికి మరోసారి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి గుత్తా అమిత్‌రెడ్డి, ప్రీతమ్ పేర్లు ఈ జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరికి రెండో విడతలోనూ అవకాశం లభించవచ్చనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడినప్పటికీ పార్టీ అభ్యున్నతి కోసం పనిచేసిన సీనియర్ నాయకులకు ఈసారి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కేవలం పార్టీ విధేయతకే పరిమితం కాకుండా.. ఆయా నియోజకవర్గాల్లో ప్రజలపై ప్రభావం చూపగలిగే నాయకత్వ సామర్థ్యం, కేడర్‌లో పట్టుతోపాటు వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఉపయోగపడే నేతలను ఎంపిక చేయడంపై అధిష్ఠానం దృష్టి సారించినట్లు సమాచారం. అంటే పదవులు పొందే నాయకులు కార్పొరేషన్లకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీకి బలంగా నిలవాలన్నది పార్టీ పెద్దల ఆలోచనగా కనిపిస్తోంది.
ఉమ్మడి జిల్లాలో రేసులో ఎవరంటే..!
నామినేటెడ్ పదవుల కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలువురు సీనియర్ నాయకుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. నల్లగొండ జిల్లా నుంచి పీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య, దుబ్బాక నర్సింహారెడ్డి, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, గుమ్మల మోహన్‌రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా నుంచి చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక సామాజిక సమీకరణాల్లో భాగంగా బీసీ కోటాలో నకిరేకల్‌కు చెందిన చామల శ్రీను (మున్నూరుకాపు), వెలమ సామాజికవర్గం నుంచి గంగాధర్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. వీరిలో కొందరికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కే అవకాశం ఉండగా, మరికొందరికి వైస్ చైర్మన్లు లేదా డైరెక్టర్ పదవులు కేటాయించవచ్చనే ప్రచారం సాగుతోంది. అయితే తుది జాబితాలో ఎవరికి చోటు దక్కుతుందన్నది అధిష్ఠానం నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.
మంత్రుల ప్రతిపాదనలు.. సామాజిక సమీకరణాలే కీలకం!
పదవుల కేటాయింపులో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల అభిప్రాయాలు కీలకం కానున్నాయి. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ప్రతిపాదనలు, సిఫారసులను సైతం పార్టీ అధిష్ఠానం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో జిల్లాల వారీగా ప్రాతినిధ్యం, సామాజికవర్గాల సమతుల్యత, పార్టీ కోసం పనిచేసిన నేతలకు గుర్తింపు వంటి అంశాలకు పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. మొత్తంగా ఈసారి నామినేటెడ్ పదవుల పంపకం కాంగ్రెస్ పార్టీలో మరోసారి రాజకీయ వేడిని పెంచుతోంది. పాతవారిలో ఎవరికి కొనసాగింపు లభిస్తుంది? కొత్తగా ఎవరికి అవకాశం దక్కుతుంది? చైర్మన్ పదవులు ఎవరిని వరిస్తాయి? వైస్ చైర్మన్లు, డైరెక్టర్ పదవులతో ఎవరికి సర్దుబాటు చేస్తారు? అన్న అంశాలపై ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెలాఖరులో వెలువడే జాబితా జిల్లాలో పార్టీ రాజకీయ సమీకరణాలను ఏ మేరకు మార్చుతుందో వేచి చూడాలి.







