Viral News: ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ తల్లి పేరిట ఆలయం

కర్నూలు ఈక్షణం, నవంబర్ 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరుదైన, ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి స్వర్గీయ హీరాబెన్ మోడీ పేరిట కర్నూలు జిల్లాలో ప్రత్యేక ఆలయ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఎమ్మిగనూరు మండలం గుండికల్ గ్రామంలో ఈ ఆలయాన్ని నిర్మించేందుకు నిర్వాహకులు ఘనంగా భూమి పూజ నిర్వహించారు.

మతాశ్రీ మందిరం చారిటబుల్ ట్రస్టు సొసైటీ ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. మాతృమూర్తికి గౌరవసూచకంగా, సేవా కార్యక్రమాలకు వేదికగా ఈ మందిరాన్ని తీర్చిదిద్దుతున్నట్లు ట్రస్టు ప్రతినిధులు తెలిపారు.

ఈ భూమి పూజ కార్యక్రమానికి స్థానికంగా రాజకీయ పార్టీలకు అతీతంగా వివిధ పార్టీల నేతలు ముఖ్య అతిథులుగా హాజరవడం విశేషం. బీజేపీ (BJP) నాయకులతో పాటు జనసేన (JanaSena), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నాయకులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని పూజా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.

ప్రధాని మోడీ తల్లి పేరిట కర్నూలు జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో ఆలయ నిర్మాణం చేపట్టడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భూమి పూజ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ట్రస్టు సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.