Eekshanam Exclusive: ఉమ్మడి నల్లగొండపై సీఎం పట్టు!

నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్టు బిగిస్తున్నారు. ఒకప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన సీనియర్ నేతల ప్రాబల్యాన్ని దాటి.. ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో నేరుగా రాజకీయ సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లా సీనియర్ల అండదండలతో టికెట్లు సాధించి గెలిచిన పలువురు నేతలు.. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వానికి దగ్గరయ్యారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో పాటు నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత సైతం ప్రస్తుత రాజకీయ సమీకరణాల్లో కీలకంగా కనిపిస్తున్నారు. సీఎం జన్మదినం సందర్భంగా జిల్లా నేతలు చేపట్టిన కార్యక్రమాలు, ప్రకటించిన విరాళాలు, పార్టీ కార్యక్రమాల్లో వారి చొరవ రేవంత్ నాయకత్వానికి లభిస్తున్న ప్రాధాన్యాన్ని చాటుతున్నాయన్న చర్చ సాగుతోంది. దీంతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ రాజకీయాల కేంద్రం మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లో ఒకప్పుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వంటి సీనియర్ నేతలదే ప్రధాన పాత్ర. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి పార్టీ వ్యవహారాల వరకు వీరి ప్రభావం ఉండేది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నేతలు తమ రాజకీయ భవిష్యత్తును సీఎం నాయకత్వంతో ముడిపెట్టుకుంటున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బాలు నాయక్, వేముల వీరేశం, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మందుల సామేలు, బత్తుల లక్ష్మారెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి వంటి నేతలు సీఎం రేవంత్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు జానారెడ్డి తనయులు జైవీర్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి సైతం మొదటి నుంచీ రేవంత్‌కు దగ్గరగా ఉంటున్నారు. దీంతో జిల్లా సీనియర్ల అండదండలపై ఆధారపడే రాజకీయాల స్థానంలో సీఎం కేంద్రంగా కొత్త సమీకరణాలు ఏర్పడుతున్నాయి.

నవంబర్ 8న సీఎం రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ నేతలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. నకిరేకల్‌లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఇతర నియోజకవర్గాల్లోనూ నేతలు సీఎం జన్మదినాన్ని పురస్కరించుకుని వివిధ కార్యక్రమాలు చేపట్టారు. పలువురు నేతలు లక్షల రూపాయలతో సేవా కార్యక్రమాలు, విరాళాల ప్రకటనలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత సైతం పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా ఆయనకు వేదికపై లభించిన గుర్తింపు కూడా రాజకీయంగా చర్చకు వచ్చింది. ఈ పరిణామాలన్నీ కలిపి చూస్తే జిల్లా పార్టీ వ్యవహారాల్లో సీఎం తనదైన ప్రభావాన్ని చూపుతున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి గతంలో జిల్లాలోని పలువురు నేతలతో బలమైన రాజకీయ సంబంధాలు ఉండేవి. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన మద్దతు పొందిన వేముల వీరేశం, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, బీర్ల అయిలయ్య, మందుల సామేలు తదితరులు ఇప్పుడు భిన్న రాజకీయ సమీకరణాల్లో ఉన్నారు. మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో రాజగోపాల్‌రెడ్డి పలుమార్లు ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయడం కూడా చర్చకు వచ్చింది. దీంతో గతంలో ఆయనకు ఉన్న రాజకీయ ప్రభావం ప్రస్తుతం ఎంతవరకు కొనసాగుతోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఆయనకు దగ్గరగా ఉన్న నేతలు ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితంగా ఉండటం జిల్లా రాజకీయాల్లో మారిన పరిస్థితులకు అద్దం పడుతోంది.

రాష్ట్ర రాజకీయాల్లో సీఎం మార్పుపై అప్పుడప్పుడు వినిపిస్తున్న ప్రచారం నేపథ్యంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేరు కూడా తెరపైకి వస్తోంది. 2024 ఆగస్టు 30న భువనగిరిలో సాగునీటి పనుల సమీక్ష సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఇప్పటికే ముఖ్యమంత్రి అని పిలవాల్సిందని, భవిష్యత్తులో తప్పకుండా ఆయన సీఎం అవుతారని వ్యాఖ్యానించారు. 2025 ఏప్రిల్‌ 28న నల్లగొండ కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలోనూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇద్దరికీ సీఎం అయ్యే అర్హత ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం మళ్లీ చర్చకు వస్తున్నాయి. ఉత్తమ్‌కు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం, అధిష్ఠానంతో పరిచయాలు, సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం వంటి బలాలున్నాయి. మరోవైపు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం సీనియర్ నేతగా కీలకంగా ఉన్నారు. అయితే జిల్లా కాంగ్రెస్‌లో ప్రస్తుతం రేవంత్‌రెడ్డికి ఉన్న పట్టు నేపథ్యంలో వీరి రాజకీయ లెక్కలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి ప్రభావం బలంగా కనిపిస్తోంది. మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయనకు సన్నిహితంగా ఉండటం, పార్టీ ముఖ్య నేతలు సీఎం నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వడం ఆయనకు రాజకీయంగా కలిసొస్తున్న అంశాలు. ఒకవేళ భవిష్యత్తులో సీఎం మార్పు అంశం నిజంగానే కార్యరూపం దాల్చితే జిల్లా రాజకీయ సమీకరణాలు మరోసారి పరీక్షకు గురికానున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి జిల్లా ఎమ్మెల్యేలు ఎంతమంది మద్దతుగా నిలుస్తారు? గతంలో తమకు రాజకీయంగా అండగా ఉన్న సీనియర్ల వైపు మొగ్గుచూపుతారా? లేక ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వాన్నే సమర్థిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారనుంది. అయితే ఇప్పటివరకు కనిపిస్తున్న పరిణామాలు మాత్రం ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌పై రేవంత్‌రెడ్డి తన పట్టును మరింత బలోపేతం చేసుకున్నారనే సంకేతాలిస్తున్నాయి.