
ఓటు చోరీని నిరసిస్తూ నవంబర్ 1న ఛలో ఢిల్లీ
- నల్గొండ జిల్లా నుంచి 2 వేల మంది తరలిరావాలి..
- ఏఐసీసీ పరిశీలకుడు రాంభూపాల్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్ రెడ్డి
నల్గొండ ఈక్షణం: ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియలో ఓటర్ల తొలగింపును నిరసిస్తూ నవంబర్ 1న నిర్వహించనున్న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐసీసీ పరిశీలకుడు రాంభూపాల్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్ రెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని యాదవ సంఘ భవన్లో సోమవారం నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత అధ్యక్షత వహించారు.
దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓటర్లను కుట్రపూరితంగా తొలగించారని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై వారు ఆరోపణలు చేశారు. ఇది దేశ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిదని విమర్శించారు. మోదీ 12 ఏళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ, ఆదివాసీ వర్గాలకు ఆశించిన ప్రయోజనాలు కలగలేదన్నారు. దేశ ప్రజలు బీజేపీ పాలనపై విసిగిపోయారని, అందుకే ఓటు చోరీకి పాల్పడుతున్నారని ఆరోపించారు.
సీబీఐ, ఈడీ వంటి సంస్థలతోపాటు స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘాన్ని కూడా మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని వారు విమర్శించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించి భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.
నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ర్యాలీకి నల్గొండ జిల్లా నుంచి సుమారు 2 వేల మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ‘ఓటును కాపాడుకుందాం.. దేశాన్ని రక్షించుకుందాం’ అనే నినాదంతో చేపడుతున్న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడు జిల్లపల్లి పరమేష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోడ స్వామి, టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సభ్యుడు చామల శ్రీనివాస్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు అంబటి సోమయ్య, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ చిలుకూరి బాలకృష్ణ, వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు గథగోని కొండయ్య, లింగాల వెంకన్న, యూత్ కాంగ్రెస్ ప్రతినిధులు పాల్గొన్నారు.







