Video: ఎల్బీనగర్ యాదవ్ సదర్ సమ్మేళనంలో ఘోర అపశృతి..

హైదరాబాద్ / ఎల్బీనగర్ ఈక్షణం, నవంబర్ 09: హైదరాబాద్ నగరంలో ఎంతో వైభవంగా సాగుతున్న సదర్ ఉత్సవాల్లో తీవ్ర ఘోర అపశృతి చోటుచేసుకుంది. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన సదర్ సమ్మేళనంలో దున్నపోతును ఆడిస్తున్న సమయంలో 16 సంవత్సరాల వయస్సు గల భవాని శంకర్ అనే బాలుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. సంతోషంగా సాగాల్సిన పండుగ వాతావరణంలో ఈ విషాద సంఘటన స్థానికులతో పాటు యాదవ సంఘాల నేతలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఆల్ ఇండియా యాదవ్ మహాసభ వైస్ ప్రెసిడెంట్ పోచబోయిన గణేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్‌లో ఈ సదర్ సమ్మేళనాన్ని ఎంతో కోలాహలంగా ఏర్పాటు చేశారు.

సదర్ వేడుకల్లో భాగంగా అలంకరించిన భారీ దున్నపోతును ప్రదర్శిస్తూ, దానితో పాటు ఉత్సాహంగా డప్పు దరువులకు డ్యాన్స్ చేస్తూ బాలుడు భవాని శంకర్ ముందుకు సాగాడు. అందరూ కేరింతలు కొడుతున్న సమయంలోనే ఊహించని రీతిలో బాలుడు ఒక్కసారిగా ఊపిరి అందక, తీవ్ర స్పృహతప్పి నేలపై పడిపోయాడు.

బాలుడు కింద పడిపోవడాన్ని గమనించిన పోచబోయిన గణేష్ యాదవ్ మరియు తోటి నిర్వాహకులు వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే అతడికి ప్రాథమిక చికిత్స అందించే ప్రయత్నం చేసి, హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరుకునేలోపే బాలుడు భవాని శంకర్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. విపరీతమైన శ్రమ, ఆయాసం లేదా హఠాత్తుగా వచ్చిన గుండెపోటే ఈ మరణానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

పండగ పూట 16 ఏళ్ల కంటిపాపను కోల్పోవడంతో భవాని శంకర్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సదర్ సమ్మేళనంలో జరిగిన ఈ విషాదం పట్ల పోచబోయిన గణేష్ యాదవ్ మరియు ఇతర యాదవ నేతలు తీవ్ర సంతాపం తెలిపారు.