Video: దాండియా ఈవెంట్‌లో కూలిన లైటింగ్ సిస్టమ్.. నాదర్‌గుల్ ఎంబీఎస్‌ఆర్ కాలేజీలో తీవ్ర విషాదం!

హైదరాబాద్, ఈ క్షణం, అక్టోబర్ 17: హైదరాబాద్ శివారులోని నాదర్‌గుల్‌లో ఉన్న ప్రసిద్ధ ఎంబీఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ (MVSR Engineering College) లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాలేజీలో అత్యంత ఉత్సాహంగా జరుగుతున్న దాండియా (Dandia) ఈవెంట్ సమయంలో భారీ అపశృతి తలెత్తింది. ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులు డ్యాన్స్ చేస్తుండగా.. అకస్మాత్తుగా భారీ లైటింగ్ సిస్టమ్ (Lighting Truss / System) ఒక్కసారిగా విద్యార్థులపై ఊడిపడింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు యువతులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరికొంతమంది విద్యార్థులకు తీవ్ర గాయాలైనట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.

కాలేజీ వేదికపై విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా దాండియా ఆడుతూ కేరింతలు కొడుతున్న తరుణంలో, ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా అక్కడ భయానక వాతావరణం నెలకొంది. స్టేజ్ పైకప్పునకు అమర్చిన భారీ లైటింగ్ ట్రస్, విద్యుత్ పరికరాలు ఒక్కసారిగా కుప్పకూలడంతో కింద ఉన్న విద్యార్థులు దాని కింద చిక్కుకుపోయారు.

సందడిగా మారాల్సిన వేడుక క్షణాల్లో రోదనలు, ఆర్తనాదాలతో మార్మోగింది. తోటి విద్యార్థులు, కాలేజీ సిబ్బంది వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాలంలో గాయపడిన విద్యార్థులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈవెంట్ నిర్వహణలో నిర్వాహకుల నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు, మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.