
అవినీతిని అడ్డుకున్నందుకే నాపై లైంగిక వేధింపుల నింద.. పౌరసరఫరాల శాఖ మేనేజర్ ఆత్మహత్య..
- ముగ్గురు జర్నలిస్టుల పేర్లతో సూసైడ్ నోట్..
- మహిళా ఉద్యోగి, ఆమె భర్తతో పాటు టీవీ9, 10టీవీ, బిగ్ టీవీ రిపోర్టర్లే నా చావుకు కారణం..
- వాట్సాప్ గ్రూప్‌లో మరణ వాంగ్మూలం పోస్ట్ చేసి లాడ్జిలో లక్ష్మీనారాయణ బలవన్మరణం..
పాల్వంచ / భద్రాచలం, ఈ క్షణం, అక్టోబర్ 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అత్యంత విషాదకర, సంచలనాత్మక ఘటన చోటుచేసుకుంది. ఆఫీసులో తోటి మహిళా ఉద్యోగి అవినీతిని అడ్డుకున్నందుకు, తనపైనే లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసి వేధించారని ఆరోపిస్తూ పౌరసరఫరాల శాఖకు చెందిన ఒక అధికారి బలవన్మరణానికి పాల్పడ్డారు.
పాల్వంచ పౌరసరఫరాల శాఖ పరిధిలోని గ్యాస్ గోడౌన్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న అనంతుల లక్ష్మీనారాయణ (57) భద్రాచలంలోని ఒక లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడటం ప్రభుత్వ శాఖల్లోనూ, మీడియా వర్గాల్లోనూ తీవ్ర దుమారం రేపుతోంది.
వాట్సాప్‌లో మరణ వాంగ్మూలం.. లాడ్జిలో మృతదేహం!
బాధితుడు లక్ష్మీనారాయణ తన ఆత్మహత్యకు ముందు కార్యాలయానికి చెందిన వాట్సాప్ గ్రూప్‌లో తన సుదీర్ఘ మరణ వాంగ్మూలాన్ని (సూసైడ్ నోట్) పోస్ట్ చేశారు. అనంతరం భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో సూసైడ్ చేసుకున్నారు. వాట్సాప్ మెసేజ్ చూసి దిగ్భ్రాంతికి గురైన సహోద్యోగులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన లాడ్జికి చేరుకోగా.. అప్పటికే లక్ష్మీనారాయణ ప్రాణాలు విడిచినట్లు గుర్తించారు.
“మీరు డబ్బు తీసుకోరు.. మమ్మల్ని తీసుకోనివ్వరా?”
లక్ష్మీనారాయణ రాసిన సూసైడ్ నోట్లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. సదరు మహిళా సహోద్యోగి గ్యాస్ కస్టమర్ల వద్ద అక్రమంగా అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయడాన్ని తాను గోడౌన్ మేనేజర్‌గా పలుమార్లు అడ్డుకున్నానని తెలిపారు. దానికి ఆ మహిళా ఉద్యోగి “మీరు డబ్బులు తీసుకోరు.. మమ్మల్ని కూడా తీసుకోనివ్వరా?” అని తనను నేరుగా ప్రశ్నించేదని పేర్కొన్నారు.
తన అవినీతి దందాను అడ్డుకుంటున్నాననే కక్షతోనే.. ఆ మహిళ తనపై కలెక్టర్ కార్యాలయంలో లైంగిక వేధింపుల తప్పుడు ఫిర్యాదు చేసిందని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా జిల్లా కలెక్టర్ అంతర్గత విచారణ కమిటీకి ఆదేశించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని తెలిపారు.
ముగ్గురు రిపోర్టర్లు, భర్త వేధింపులే కారణం!
తన ఆత్మహత్యకు సదరు మహిళా ఉద్యోగి, ఆమె భర్త నాయిని రాజేష్ తో పాటు స్థానిక టీవీ ఛానళ్ల ప్రతినిధులు 10టీవీ రిపోర్టర్ నాగ చందు, బిగ్ టీవీ రిపోర్టర్ వెంకన్న, టీవీ9 రిపోర్టర్ రవి లు తీవ్రంగా వేధించారని, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారని లక్ష్మీనారాయణ సూసైడ్ నోట్లో స్పష్టంగా పేర్కొన్నారు. వీరి వేధింపులు తాళలేకే తాను ప్రాణాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న భద్రాచలం పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని, సదరు మహిళా ఉద్యోగి, ఆమె భర్త మరియు విలేకరులపై సమగ్ర విచారణ చేపడుతున్నారు.







