
పీఆర్సీపై తాత్సారం చేస్తే మరో ఉద్యమం తప్పదు: పీఆర్టీయూ రాష్ట్ర కౌన్సిల్
- నల్గొండ జీఎం గార్డెన్లో ఘనంగా పీఆర్టీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు!
- 6 వేల మంది ఉపాధ్యాయుల హాజరుతో రెపరెపలాడిన పీఆర్టీయూ జెండాలు..
- ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షం గౌడ్ అధికారిక ప్రకటన..
నల్గొండ, ఈ క్షణం, అక్టోబర్ 15: ఉమ్మడి నల్గొండ జిల్లా కేంద్రంలోని జీఎం గార్డెన్స్లో పీఆర్టీయూ టీఎస్ (PRTU TS) 6వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు రాష్ట్ర సంఘ అధ్యక్షులు పుల్గం దామోదర్ రెడ్డి అధ్యక్షతన అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నల్గొండ పట్టణమంతా పీఆర్టీయూ జెండాలతో రెపరెపలాడింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6,000 మందికి పైగా పీఆర్టీయూ డెలిగేట్లు, ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ సమావేశాన్ని దిగ్విజయం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పీఆర్టీయూ ఎమ్మెల్సీ పింగిల్ శ్రీపాల్ రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వంపై ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం..
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పీఆర్సీ సాధన, పెండింగ్ బిల్లుల పరిష్కారం, ఎన్నికల ముందు ఇచ్చిన సీపీఎస్ (CPS) రద్దు హామీ, హెల్త్ కార్డ్స్ (EHS) లోపాల సవరణ, అలాగే గురుకుల, కేజీబీవీ (KGBV), మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తాను శాసనమండలిలో వందల సార్లు గళం వినిపించానని తెలిపారు. పలుమార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సెప్టెంబర్ 1న 35,000 మంది ఉపాధ్యాయులతో ఇందిరాపార్కు వద్ద భారీ ధర్నా నిర్వహించామని, ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతమైన ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షం గౌడ్ ప్రకటన..
చట్టసభలలో ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లు, నిరుద్యోగుల గొంతుక గట్టిగా వినిపించేందుకు సమర్థుడైన నాయకుడు అవసరమని శ్రీపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 15 ఏళ్లుగా అధ్యక్షుడిగా పని చేసి, ప్రస్తుతం రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్న సుంకరి భిక్షం గౌడ్ ని రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు పీఆర్టీయూ అధికారిక అభ్యర్థిగా ఈ సమావేశంలో ఏకగ్రీవంగా ప్రకటించారు.
అనంతరం రాష్ట్ర సంఘ అధ్యక్షులు పుల్గం దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే 72,000 సభ్యత్వం కలిగిన ఏకైక అతిపెద్ద ఉపాధ్యాయ సంఘం పీఆర్టీయూ అని, ఎప్పుడూ ఉపాధ్యాయుల సంక్షేమం కోసమే పోరాడుతుందని తెలిపారు.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన పేరు ప్రకటించడంపై సుంకరి భిక్షం గౌడ్ కృతజ్ఞతలు తెలుపుతూ.. గత ప్రభుత్వం చేసిన తప్పులే ప్రస్తుత ప్రభుత్వం కూడా చేస్తోందని, ఉపాధ్యాయుల, విద్యావంతుల గొంతుకగా నిలబడి తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, పీఆర్టీయూ అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డి, క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ రాష్ట్ర అధ్యక్షులు పేరి వెంకట్రెడ్డి, గుండు లక్ష్మణ్, జగన్మోహన్ గుప్త, నల్గొండ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాళం నారాయణరెడ్డి, మేకల జానారెడ్డి, గీత, త్రివేణి, విజయలక్ష్మి, కళావతి, శ్రీవిద్య, అనిత రెడ్డి, సునీతతో పాటు 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, వేలాది మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.







