
Eekshanam Exclusive: పేట కాంగ్రెస్‌లో కొత్త కూటమి..
- పాత ప్రత్యర్థుల దోస్తీ!
- సూర్యాపేట కాంగ్రెస్‌లో కాకపుట్టిస్తున్న ఆధిపత్య పోరు
- దామన్న వారసుడు సర్వోత్తమ్ రెడ్డికి పటేల్ రమేష్ రెడ్డి అండ
- గ్రాడ్యుయేట్ ఎన్నికల వేళ మారిన పేట రాజకీయ సమీకరణాలు
- మంత్రి ఉత్తమ్ అనుచరుడు వేణారెడ్డికి చెక్‌పెట్టే వ్యూహాం?
నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: సూర్యాపేట కాంగ్రెస్ రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మరణానంతరం ఆయన రాజకీయ వారసత్వంపై మొదలైన ఆధిపత్య పోరు ఇప్పుడు కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. దామన్న కుమారుడు సర్వోత్తమ్‌రెడ్డి తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆయనకు గతంలో రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న పటేల్ రమేష్‌రెడ్డి ఇప్పుడు అండగా నిలుస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ వీరిద్దరూ చేతులు కలపడం సూర్యాపేట కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు దామన్నకు అత్యంత సన్నిహితుడైన కొప్పుల వేణారెడ్డికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారనే ప్రచారం కొనసాగుతోంది. దీంతో ఉత్తమ్, వేణారెడ్డి ఒకవైపు.. సర్వోత్తమ్–పటేల్ మరోవైపు అన్నట్టుగా పేట కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ కూటమికి తెరతీసింది. ఈ రెండు సమీకరణాల వెనుక ఎవరికి వారు తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పావులు కదుపుతున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. గ్రాడ్యుయేట్ ఎన్నికలతో మొదలైన ఈ దోస్తీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎలాంటి మలుపు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
దామన్న వారసత్వంపై ఎవరి గురి?
దామన్న మరణంతో సూర్యాపేట కాంగ్రెస్‌లో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహిత నేతలు తమదైన ప్రయత్నాలు చేస్తున్నారు. దామన్న కుమారుడిగా సర్వోత్తమ్‌రెడ్డి తన తండ్రి రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. అదే సమయంలో దామన్నకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కొప్పుల వేణారెడ్డి సైతం ఆయనతో తనకున్న అనుబంధాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దామన్న చిత్ర పటానికి నివాళులర్పించడం, ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేయడం ద్వారా పార్టీ కేడర్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో దామన్న రాజకీయ వారసత్వాన్ని ఎవరు కొనసాగిస్తారనే అంశం సూర్యాపేట కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. తన తండ్రి రాజకీయ నేపథ్యం, అనుచరగణాన్ని సమీకరించుకుంటూ సర్వోత్తమ్‌రెడ్డి పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జిల్లా రాజకీయాల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తుండటం, ఆయన వేణారెడ్డికి ప్రాధాన్యత ఇస్తున్నారనే అభిప్రాయం సర్వోత్తమ్ వర్గంలో అసంతృప్తికి కారణమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సర్వోత్తమ్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసం కొత్త సమీకరణాల దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఫ్లెక్సీల నుంచి వేదిక వరకు.. గ్రూపు రచ్చ!
ఇటీవల సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఉమ్మడి నల్లగొండ జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం కాంగ్రెస్ అంతర్గత విభేదాలను మరోసారి బయటపెట్టింది. సమావేశానికి సంబంధించిన ఫ్లెక్సీ లు, వేదికపై నేతలకు కల్పించిన ప్రాధాన్యత, ప్రోటోకాల్ అంశాలు ఇరువర్గాల మధ్య వివాదానికి కారణమైనట్లు సమాచారం. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమక్షంలోనే ఇరువర్గాల నేతలు ఘర్షణకు దిగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇన్నాళ్లూ తెరవెనుక సాగిన విభేదాలు బహిరంగంగా బయటపడటంతో సూర్యాపేట కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు మరోసారి రచ్చకెక్కాయి. దామన్న కుమారుడైన సర్వోత్తమ్ రెడ్డికి తగిన రాజకీయ ప్రాధాన్యత దక్కడం లేదనే అభిప్రాయం ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వేణారెడ్డికి మంత్రి ఉత్తమ్ అండగా ఉండటంతో పార్టీలో తన ప్రాధాన్యతను నిలబెట్టుకునేందుకు సర్వోత్తమ్ కొత్త వ్యూహాలను అనుసరిస్తున్నారా? అన్న చర్చ మొదలైంది.
పటేల్ ఎంట్రీతో ఎత్తుకు పైఎత్తు!
సర్వోత్తమ్‌రెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డిల మధ్య కుదిరిన సయోధ్య ఇప్పుడు పేట రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. గతంలో రాజకీయంగా విభేదించిన ఈ ఇద్దరు నేతలు ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పనిచేస్తుండటం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందనే చర్చ సాగుతోంది. సర్వోత్తమ్ రెడ్డికి మద్దతుగా పటేల్ రమేష్‌రెడ్డి ఓటరు నమోదు కార్యక్రమం నుంచి ఎన్నికల ప్రచారం వరకు చురుగ్గా పాల్గొంటున్నారు. ఇద్దరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమే కాకుండా, పలు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ కనిపిస్తున్నారు. ఈ కలయికతో సూర్యాపేట పట్టణ కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ సమీకరణం ఏర్పడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దామన్న కుమారుడైన సర్వోత్తమ్కు పటేల్ రమేష్ రెడ్డి అండగా నిలవడం ద్వారా వేణారెడ్డి రాజకీయ ప్రాధాన్యతకు ప్రత్యామ్నాయంగా మరో బలమైన సమీకరణం తెరపైకి వస్తోందా? అన్నది చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్య సయోధ్యకు పార్టీ పెద్దలు మధ్యవర్తిత్వం వహించారా? లేక మారుతున్న రాజకీయ పరిస్థితులను అంచనా వేసి ఇరువురు స్వయంగా దగ్గరయ్యారా? అనేది స్పష్టత రావాల్సి ఉంది.
ఎమ్మెల్సీతో పాటు అసెంబ్లీ లెక్కలు!
ప్రస్తుతానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ ఇద్దరు నేతలను ఒకే వేదికపైకి తీసుకొచ్చినప్పటికీ.. దీని వెనుక భవిష్యత్ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనే చర్చ నడుస్తోంది. సర్వోత్తమ్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిస్తే ఆయన రాజకీయ స్థాయి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో పటేల్ రమేష్ రెడ్డికి సూర్యాపేట అసెంబ్లీ రాజకీయాల్లో తన పట్టును చాటుకునేందుకు ఈ కొత్త రాజకీయ స్నేహం ఉపయోగపడుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సర్వోత్తమ్ ఎమ్మెల్సీ రాజకీయాల్లో ముందుకు సాగితే.. పటేల్ రమేష్‌రెడ్డికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయంగా వెసులుబాటు కలుగుతుందనే అంచనాలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరోవైపు వేణారెడ్డి రాజకీయంగా మరింత బలపడక ముందే సర్వోత్తమ్కు మద్దతు కూడగట్టడం ద్వారా పార్టీ అంతర్గత సమీకరణాల్లో మార్పు తీసుకురావాలనే వ్యూహం ఉందా? అన్న చర్చ కూడా సాగుతోంది.
ఉత్తమ్ వర్గానికి ప్రత్యామ్నాయ సమీకరణమా?
జిల్లా రాజకీయాల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో సూర్యాపేట కాంగ్రెస్‌లో ఆయనకు సమాంతరంగా మరో రాజకీయ సమీకరణం రూపుదిద్దుకుంటోందా? అనే చర్చ మొదలైంది. దామన్న కుమారుడిగా సర్వోత్తమ్‌రెడ్డికి ఉన్న రాజకీయ నేపథ్యం, పటేల్ రమేష్‌రెడ్డికి ఉన్న స్థానిక రాజకీయ అనుభవం కలిస్తే పార్టీ అంతర్గత సమీకరణాల్లో ఎలాంటి మార్పులు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఉత్తమ్, వేణారెడ్డి అనుబంధానికి రాజకీయంగా పోటీగా సర్వోత్తమ్, పటేల్ దోస్తీ మారుతుందా? లేక గ్రాడ్యుయేట్ ఎన్నికల అవసరాల కోసం ఏర్పడిన తాత్కాలిక సయోధ్యగానే మిగిలిపోతుందా? అన్నది తేలాల్సి ఉంది.







