
Eekshanam Exclusive: మిర్యాలగూడెంలో.. సాండ్ బజార్‌కు అధికార పార్టీ తాళం!
- ప్రైవేటు లారీ ఓనర్ల ప్రయోజనాల కోసం ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు
- సాండ్ బజార్ మూసివేతతో మళ్లీ పాత దందా
- అధికార పార్టీ నేతలు, మైనింగ్ కార్పోరేషన్ కు భారీ కమీషన్లు..
- టన్ను ఇసుక రూ.వెయ్యి నుంచి రూ.1,600కు పైగా..
- లబోదిబోమంటున్న ఇందిరమ్మ లబ్ధిదారులు, సామన్య ప్రజలు
- ఉపాధి కోల్పోయిన పరిసర గ్రామాల్లోని ట్రాక్టర్ల యజమానులు
నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: సామాన్యులకు తక్కువ ధరకు ఇసుక అందించాలనే ప్రభుత్వ లక్ష్యం మిర్యాలగూడెంలో నీరుగారిపోయింది. అక్రమ ఇసుక వ్యాపారానికి అడ్డుకట్ట వేసి, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో ఇసుకను అందించేందుకు ఏర్పాటు చేసిన సాండ్ బజార్‌కు తాళం పడింది. ప్రభుత్వం టన్ను ఇసుక వెయ్యి రూపాయాలకే సప్లై చేస్తుండటం తో ప్రైవేటు లారీ యజమానులు, అక్రమ ఇసుక వ్యాపారుల దందాకు గండిపడింది. దీంతో ఎలాగైనా సాండ్ బజార్‌ను మూసివేయించాలనే ప్రయత్నాలు తెరవెనుక సాగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు లారీ యజమానులకు ప్రయోజనం చేకూర్చడంతోపాటు అక్రమ ఇసుక వ్యాపారానికి మళ్లీ మార్గం సుగమం చేసేందుకు అధికార పార్టీ నేతలు, మైనింగ్ కార్పోరేషన్ ఆఫీసర్లకు భారీ స్థాయిలో కమీషన్లు ముట్టజెప్పి సాండ్ బజార్‌ను మూసివేయించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం పక్కదారి పట్టగా.. సామాన్యులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మళ్లీ పాతపద్ధతిలోనే దళారుల చేతుల్లో నష్టపోవాల్సి వస్తోంది.
మాఫియా దందాకు సాండ్ బజార్ గండి!
గతంలో ఇసుక వ్యాపారం ప్రైవేటు లారీ యజమానులు, దళారుల చేతుల్లో ఉండేది. వంగమర్తి, కాలేశ్వరం, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి లారీల్లో అక్రమంగా ఇసుక తెచ్చి మిర్యాలగూడెంలో అక్రమంగా ఏర్పాటు చేసిన డంప్‌ల వద్ద నిల్వ చేయడం జరిగేది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మైనింగ్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో సాండ్ బజార్‌ను అందుబాటులోకి తెచ్చింది. మీ సేవ ద్వారా బుక్ చేసుకున్న వారికి ప్రభుత్వ నిర్ణయించిన ధరకు టన్నుకు రూ.వెయ్యి చొప్పున ఇసుక అందించే అవకాశం కల్పించడంతో అక్రమ దందాకు గండిపడింది. తిరిగి తమ దందాను కొనసాగించేందుకు ప్రైవేటు లారీ ఓనర్లు, అక్రమ ఇసుక వ్యాపారులు పావులు కదిపినట్టు తెలిసింది. అధికార పార్టీ ముఖ్యనేతలతో చేతులు కలిపి సాండ్ బజార్‌ను మూసివేయించేందుకు ప్లాన్ చేశారు. సాండ్ బజార్ వల్ల ఎవరికీ ఉపయోగం లేదని అధికారుల పైన ఒత్తిడి తెచ్చి తాళం వేయించారు.

మళ్లీ పాతపద్ధతిలోనే అక్రమ ఇసుక దందా!
సాండ్ బజార్ మూతపడటంతో ఇసుక వ్యాపారం మళ్లీ పాత పద్ధతిలోకి వెళ్లిందనే విమర్శలు వస్తున్నాయి. గతంలో ప్రభుత్వ ధరకు టన్నుకు రూ.వెయ్యికి లభించిన ఇసుక ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ.1,600 నుంచి రూ.2 వేల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది దళారులు అక్రమంగా ఇసుక డంపులు ఏర్పాటు చేసి ఇసుక మాఫియా నడిపిస్తున్నట్టు తెలిసింది. అధికార పార్టీకి చెందిన ముఖ్యనేతల అనుచరుల అండతో ఇసుక మాఫియా నడుస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. తడకమళ్ల, తక్కెళ్లపాడు ప్రాంతాల్లో బహిరంగంగానే ఇసుక డంపులు ఏర్పాటు చేసినట్టు తెలిసింది.
అడ్డగోలుగా ఇసుక అక్రమ డంప్‌లు…
మిర్యాలగూడ పట్టణ పరిసరాల్లో అక్రమంగా తడకమళ్ల ఎక్స్‌రోడ్డు, రామ చంద్రగూడెంలోని శరణ్య గ్రీన్హౌస్ సమీపంలో, హనుమాన్‌పేట ఫ్లైఓవర్ వద్ద తదితర ప్రాంతాల్లో సుమారు ఆరు చోట్ల ఇసుక డంపుల ద్వారా విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. వేములపల్లి మండలంలోని రావులపెంటకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో దందా సాగుతోందని, మిర్యాలగూడ మండలం తక్కెళ్లపాడుకు చెందిన మరో వ్యక్తి అండతో అక్రమ ఇసుక మాఫియా నడుస్తోందని తెలిసింది. దామరచర్ల మండలానికి చెందిన అధికార పార్టీ నేత ఒకరు ఖమ్మం నుంచి లారీల ద్వారా ఇసుక తెచ్చి భారీగా డంపులు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

రోడ్డున పడ్డ 30 ట్రాక్టర్ల కుటుంబాలు
సాండ్ బజార్ మూసివేయడంతో పరిసర గ్రామాల్లోని ట్రాక్టర్ల ఓనర్లు ఉపాధి కోల్పోయామని వాపోతున్నారు. రోజుకు ఐదు నుంచి ఆరు ట్రిప్పుల వరకు నడుపుతూ కుటుంబాలను పోషించుకునే కుటుంబాలు, ఇప్పుడు ఉపాధి కోల్పోయమని చెపుతున్నారు. మిర్యాలగూడ మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన రాంబాబు మాట్లాడుతూ.. సాండ్ బజార్ ఉన్నప్పుడు రోజుకు ఐదు నుంచి ఆరు ట్రిప్పులు నడిపేవాళ్లమని కానీ ఇప్పుడు ఉపాధి కోల్పోయామని చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కష్టాలు
సాండ్ బజార్ మూతపడటంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. వేములపల్లి మండలం రావులపెంట, మిర్యాలగూడ మండలం తక్కెళ్లపాడు వద్ద ప్రభుత్వ ఇసుక రీచ్‌లు ఉన్నప్పటికీ మీ సేవ ద్వారా బుక్ చేసుకున్న వారికి సకాలంలో ఇసుక సరఫరా కావట్లేదని చెప్తున్నారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇసుక పంపడం లేదని, గత్యంతరం లేక ప్రైవేటు దళారుల వద్ద ఎక్కువ రేట్లకు ఇసుక కొంటున్నామని లబ్ధిదారులు చెప్పారు. కొండ్రపాడు గ్రామానికి చెందిన వినయ్ మాట్లాడుతూ.. సాండ్ బజార్ లేకపోవడంతో ఇసుక అందక ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు నిలిపివేశానని చెప్పిండు. గతంలో టన్నుకు రూ.వెయ్యి చెల్లిస్తే ఇసుక వచ్చేదని, ఇప్పుడు దళారులకు రూ.1,600 చెల్లించినా సరిగా సప్లై చేయట్లేదని చెప్పారు.
సోమవారం నుంచి మళ్లీ ఇసుక అందిస్తాం: కార్పొరేషన్ పీఓ మదన్ మోహన్ గౌడ్(9885789965)
ఈ వ్యవహారంపై జిల్లా మైనింగ్ శాఖ అధికారిని వివరణ కోరగా, సాండ్ బజార్ నిర్వహణ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుందని తెలిపారు. దీనిపై కార్పొరేషన్ పీఓ మదన్ మోహన్ గౌడ్ స్పందిస్తూ.. “గతంలో ఉన్న కాంట్రాక్టర్ గడువు పూర్తవడంతో తాత్కాలికంగా ఇసుక రవాణా నిలిచిపోయింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొత్త కాంట్రాక్టర్‌ను నియమించి, రాబోయే సోమవారం నుంచి ప్రజలకు ప్రభుత్వ నిర్ణీత ధరలకే ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాము” అని స్పష్టం చేశారు.







