
హైదరాబాద్ ఐసీసీసీలో SRPCC సదస్సును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..
- సురక్షిత దక్షిణ భారత్ కోసం సమన్వయంతో ముందడుగు
- దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
- ఐసీసీసీ సాంకేతికతను షేర్ చేసుకునేందుకు తెలంగాణ సిద్ధమని ప్రకటన!
హైదరాబాద్, ఈ క్షణం, అక్టోబర్ 23: దక్షిణ భారతదేశాన్ని అత్యంత నేరరహిత, సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు దక్షిణాది రాష్ట్రాల పోలీసు విభాగాలు సమన్వయంతో, సమిష్టిగా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నేరాల నియంత్రణలో తెలంగాణ అనుసరిస్తున్న ఆధునిక సాంకేతిక మౌలిక సదుపాయాలు, సమగ్ర ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) వ్యవస్థను పొరుగు రాష్ట్రాలతో పంచుకోవడానికి మరియు సమన్వయం చేసుకోవడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా ప్రారంభమైన దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమన్వయ కమిటీ (SRPCC) సదస్సును ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

రాష్ట్రాల మధ్య సమన్వయం అత్యంత కీలకం!
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఏ రాష్ట్రమూ తన సొంత వనరులతో మాత్రమే పరిపూర్ణంగా నేరరహిత ప్రాంతంగా మారలేదని, సరిహద్దులు దాటి జరిగే నేరాలను అరికట్టేందుకు పోలీసు విభాగాలు పరస్పరం సమాచారాన్ని మార్పిడి చేసుకోవాలని ఉద్ఘాటించారు.
సీఎం ప్రసంగం – ముఖ్యాంశాలు:
భద్రతా పెట్టుబడి: పోలీసు వ్యవస్థకు కేటాయించే బడ్జెట్ ఖర్చు కాదు.. భద్రమైన సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వం పెట్టే పెట్టుబడి.
పోలీసింగ్ సంస్కరణలు: మహానగర భద్రత కోసం హైదరాబాద్‌ను హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి అనే మూడు కమిషనరేట్లుగా విభజన.
ప్రత్యేక విభాగాలు: HYDRAA, EAGLE, TG-SAFE, TG-TMARS వంటి ప్రత్యేక విభాగాలు అందుబాటులోకి తెచ్చాం.
ట్రాన్స్జెండర్లకు ప్రాధాన్యం: ట్రాఫిక్ విభాగంలో ట్రాన్స్జెండర్లను అసిస్టెంట్లుగా నియమించిన దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు.
ప్రతిభ చాటిన తెలంగాణ పోలీస్ శాఖ!
మాదకద్రవ్యాల నిరోధక ఈగల్ (EAGLE) విభాగం పనితీరుకు కేంద్రం 80 శాతానికి పైగా మార్కులు ఇచ్చిందని, సైబర్ నేరాల బాధితులకు సొమ్మును రీఫండ్ చేయడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) జాతీయ స్థాయిలో కొత్త ప్రమాణాలు నెలకొల్పి ప్రధాని మోదీ ప్రశంసలు కూడా పొందిందని సీఎం గుర్తుచేశారు. అలాగే యుఎస్ ఎఫ్‌డీఏ (FDA) తరహాలో ఆహార కల్తీ, ఔషధాల నియంత్రణ కోసం ‘టీజీ-సేఫ్’ (TG-SAFE) ను రూపొందించినట్లు చెప్పారు.

పోలీసు సంక్షేమం – యంగ్ ఇండియా పోలీస్ స్కూల్!
విధి నిర్వహణలో అమరులైన పోలీసు కుటుంబాలకు హోదాను బట్టి రూ. 1 కోటి నుంచి రూ. 2 కోట్ల వరకు ఎక్స్‌గ్రేషియా, ఇంటి స్థలం, కారుణ్య నియామకం కల్పిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. హోంగార్డు నుంచి డీజీపీ స్థాయి అధికారుల పిల్లల వరకు నాణ్యమైన విద్యనందించేందుకు హైదరాబాద్‌లో ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్’ ప్రారంభించామని వివరించారు.
ఈ కీలక సమావేశంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, కర్ణాటక డీజీపీ డాక్టర్ ఎంఏ సలీమ్, తమిళనాడు డీజీపీ డాక్టర్ మహేష్ అగర్వాల్, పుదుచ్చేరి డీజీపీ షాలిని సింగ్, లక్షద్వీప్ ఏడీజీ బి. శంకర్ జైస్వాల్, కేరళ ఐజీ అజీతా బేగం, ఏపీ ఐజీపీ రవి కృష్ణతో పాటు తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులు సందీప్ శాండిల్య, శిఖా గోయల్, మహేష్ భగవత్, సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.







