నీటి వృథా: ప్యారడైజ్ హోటల్‌కు రూ. 20 వేల భారీ జరిమానా..

హైదరాబాద్ ఈక్షణం, అక్టోబర్ 27: మహానగరంలో రానున్న రోజుల్లో నీటి కొరత తలెత్తకుండా ఉండేందుకు నీటి పొదుపు చర్యలు చేపట్టిన హైదరాబాద్ జలమండలి (HMWSSB) నీటి వృథాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాగునీటిని బేఖాతరు చేస్తూ దుర్వినియోగానికి పాల్పడినందుకు సికింద్రాబాద్‌లోని ప్రముఖ ప్యారడైజ్ హోటల్ (Paradise Hotel) యాజమాన్యానికి జలమండలి అధికారులు రూ. 20,000 జరిమానా (Fine) విధించారు.

హైదరాబాద్ వ్యాప్తంగా నీటి వృథాను అరికట్టేందుకు జలమండలి అధికారులు ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దించిన నేపథ్యంలో ఈ చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

జలమండలి ఖైరతాబాద్ జోన్ పరిధిలోని డివిజన్-16 అధికారులు మంగళవారం పలు వాణిజ్య సముదాయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సందర్భంగా సికింద్రాబాద్‌లోని ప్రముఖ ప్యారడైజ్ హోటల్‌లో (CAN నంబర్: 612182839) తాగునీరు పెద్ద ఎత్తున వృథా అవుతున్నట్లు అధికారులు ప్రత్యక్షంగా గుర్తించారు.

దీంతో తక్షణమే స్పందించిన అధికారులు హోటల్ యాజమాన్యానికి రూ. 20 వేల చలానా విధించడంతో పాటు, భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి నీటి దుర్వినియోగానికి పాల్పడితే నీటి సరఫరా కనెక్షన్ రద్దు చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు.

ఇప్పటికే భాగ్యనగరంలో నీరు, విద్యుత్ వినియోగాన్ని 20 శాతం మేర తగ్గించుకోవాలని వాటర్ బోర్డు ఎండీ ఆదేశించిన సంగతి తెలిసిందే. కమర్షియల్ హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, సర్వీస్ సెంటర్లు మరియు వ్యాపార సముదాయాల్లో తాగునీటిని క్లీనింగ్, వాహనాలు కడగడం వంటి పనులకు వృథాగా వాడితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు పునరుద్ఘాటించారు. నగర ప్రజలు, వ్యాపారులు నీటి ప్రాధాన్యతను గుర్తించి పొదుపుగా వాడుకోవాలని కోరారు.