పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి: అడిషనల్ సీఈఓ

నల్లగొండ, ఈక్షణం ప్రతినిధి: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫారం-18 దరఖాస్తులను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన పట్టభద్రులకు ఓటు హక్కు కల్పించాలని, డూప్లికేట్ ఓట్లను గుర్తించి నిబంధనల ప్రకారం తిరస్కరించాలని స్పష్టం చేశారు.

గురువారం నల్లగొండ కలెక్టరేట్‌లోని వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్వో) ఛాంబర్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లాల ఈఆర్వోలు, ఆర్డీవోలతో ఓటరు నమోదు ప్రక్రియపై ఆయన సమీక్ష నిర్వహించారు. పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియలో నల్లగొండ జిల్లా ముందుండటంపై జిల్లా కలెక్టర్, ఈఆర్వోలు, సిబ్బందిని అభినందించారు. యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లోనూ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

దరఖాస్తులు అందిన వెంటనే పరిశీలించి పరిష్కరించాలని, పట్టభద్రుల విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు, ప్రొవిజనల్ సర్టిఫికెట్లు, ఉద్యోగుల ధ్రువపత్రాలను నిబంధనల ప్రకారం జాగ్రత్తగా పరిశీలించాలని ఆదేశించారు. విశ్వవిద్యాలయాలు జారీ చేసిన డిగ్రీ ధ్రువీకరణ పత్రాలను సైతం క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి ధ్రువపత్రాల పరిశీలనను వేగవంతం చేయాలని చెప్పారు.

ఓటరు నమోదు ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా చూడాలని, బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్‌ఓలు) ఓటర్ల నివాస వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. విద్యార్హతల ధ్రువీకరణను సంబంధిత అధికారులు తనిఖీ చేయాలన్నారు. ఓటర్ల చిరునామా మార్పులకు సంబంధించిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని, ముసాయిదా ఓటరు జాబితా వివరాలు, ఓటరు చీటీల పరిశీలనలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

పోలింగ్ కేంద్రాలను ఓటర్లకు అందుబాటులో ఉండేలా ఎంపిక చేయాలని, ఉపాధ్యాయులకు వారి నివాస ప్రాంతాలకు సమీపంలోని పోలింగ్ కేంద్రాలను కేటాయించే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. నిర్ణీత గడువులోగా ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, జంబో బ్యాలెట్ బాక్సుల లభ్యతపై ఆరా తీశారు. ఏ జిల్లాలోనైనా ఎన్నికల సామగ్రి కొరత ఉంటే వెంటనే తెలియజేయాలని, అవసరమైన ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. డీటీసీలోని కంప్యూటర్ కేంద్రంలో 20 కంప్యూటర్లు ఏర్పాటు చేసి, సిబ్బందితో రెండు షిఫ్టుల్లో రాత్రింబవళ్లు దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు వివరించారు. ఎంజీ యూనివర్సిటీ విద్యార్థుల సహకారం తీసుకుంటున్నామని, ఆర్డీవో స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు. రానున్న నాలుగు రోజుల్లో ఓటరు నమోదు సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ట్రైనీ సహాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ థియాన్ మావి, ఉమ్మడి జిల్లాల ఈఆర్వోలు, ఆర్డీవోలు, ఏఈఆర్వోలు, తహసీల్దార్లు, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.