
నేను మంత్రి, సీఎం కాకపోవచ్చు.. కానీ.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- కానీ క్రెడిబిలిటీలో వారి కంటే ఎక్కువే
- కూలిపోయే కాళేశ్వరానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టి.. ఫ్లోరైడ్ పీడిత మునుగోడు చెరువులకు నిధులివ్వరా?
- మునుగోడులో ఎమ్మెల్యే ఆవేదన!
మునుగోడు / నల్గొండ ఈక్షణం, నవంబర్ 02: తాను మంత్రి, ముఖ్యమంత్రి కాకపోవచ్చునని, కానీ వ్యక్తిగత క్యారెక్టర్, క్రెడిబిలిటీ మరియు కెపాసిటీ విషయంలో మాత్రం వారందరికంటే ఎక్కువేనని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరైడ్ సమస్యతో దశాబ్దాలుగా సతమతమవుతున్న మునుగోడు నియోజకవర్గంలో చిన్న నీటి వనరులు, చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి తగినన్ని నిధులు రావడం లేదంటూ ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
సోమవారం మునుగోడులో ‘ఎల్‌నినో ప్రభావం – నివారణ చర్యలు’ పై నిర్వహించిన ఉన్నత స్థాయి అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
కూలిపోయే కాళేశ్వరానికి లక్ష కోట్లు.. మునుగోడుకు నిధులేవీ?
గత ప్రభుత్వ హయాంలో కుప్పకూలిపోతున్న కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఏకంగా లక్ష కోట్లు ఖర్చు పెట్టారని, కానీ ఫ్లోరైడ్ పీడిత మునుగోడు నియోజకవర్గంలో చెరువులు, చిన్న నీటి వనరులను కాపాడుకోవడానికి మాత్రం నిధులు కేటాయించడం లేదని రాజగోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో దాదాపు 300 చెరువులను గుర్తించి వాటిని ఎ, బి, సి కేటగిరీలుగా విభజించి అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించినప్పటికీ, ఆశించిన స్థాయిలో నిధులు విడుదల కాలేదని స్పష్టం చేశారు.
డిండి ఎత్తిపోతలే మునుగోడుకు శాశ్వత పరిష్కారం!
మునుగోడు ప్రాంతానికి సాగునీటి అందించడంలో డిండి ఎత్తిపోతల పథకమే ఏకైక శాశ్వత పరిష్కారమని రాజగోపాల్‌రెడ్డి పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వం రిజర్వాయర్ల నిర్మాణానికి వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ, అసలు డిండికి నీటిని ఎక్కడి నుంచి తీసుకురావాలో స్పష్టమైన ప్రణాళిక రూపొందించలేదని విమర్శించారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో చర్చించి ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించాలని నిర్ణయించినట్లు తెలిపారు. నాగర్‌కర్నూల్, వనపర్తి ప్రాంతాల ఎమ్మెల్యేలు, ప్రజలను ఒప్పించి త్వరలోనే ఈ పనులు ప్రారంభించాల్సి ఉందని పేర్కొన్నారు. రాబోయే వర్షాకాలానికి ముందే చెరువుల పునరుద్ధరణపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
కౌలు రైతులకు కూడా పరిహారం ఇవ్వాలి!
ఎల్‌నినో (El Nino) ప్రభావం కారణంగా మునుగోడు ప్రాంతంలో పంట దిగుబడి గణనీయంగా పడిపోయిందని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. నష్టపోయిన రైతులను ఆదుకోవడంతో పాటు, నేల కౌలుకు తీసుకుని సాగు చేసిన కౌలు రైతులకు కూడా ప్రభుత్వం ద్వారా తగిన పరిహారం అందేలా ప్రత్యేక నివేదికను ప్రభుత్వానికి పంపాలని జిల్లా కలెక్టర్‌ను ఆయన కోరారు.
ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, యాదాద్రి, నల్గొండ జిల్లాల అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







