చిల్లర వివాదం.. మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి తోసేసిన ప్రయాణికురాలు

మణుగూరు ఈక్షణం, నవంబర్ 03: కేవలం చిల్లర డబ్బుల (Change) విషయంలో జరిగిన చిన్న వాగ్వాదం ఒక ప్రాణాన్ని బలిగొంది. టికెట్ మిగులు డబ్బులు ఇప్పుడే ఇవ్వాలంటూ ఓ ప్రయాణికురాలు చేసిన దుర్మార్గపు పనికి ఆర్టీసీ మహిళా కండక్టర్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ అత్యంత విషాదకర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

అశ్వాపురం మండలం మిట్టగూడెంకు చెందిన మౌనిక అనే మహిళ తన కొడుకుతో కలిసి భద్రాచలం వెళ్లేందుకు మణుగూరు వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కింది.

బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో మౌనిక తన కొడుకుకు టికెట్ తీసేందుకు కండక్టర్‌కు రూ. 100 నోటు ఇచ్చింది. టికెట్ ధర పోను మిగతా చిల్లర సరిగ్గా లేకపోవడంతో, కండక్టర్ ప్రవళిక రూ. 10 టికెట్ జారీ చేసి, మిగతా బ్యాలెన్స్ చిల్లర రూ. 90 ని ఆ టికెట్ వెనుక రాసిచ్చారు.

అయితే, ఆ చిల్లరను ఇప్పుడే ఇవ్వాలని మౌనిక కండక్టర్ ప్రవళికతో గొడవకు దిగింది. మాట మాట పెరగడంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన మౌనిక.. ప్రయాణికురాలు అని కూడా చూడకుండా కండక్టర్ ప్రవళికను కదులుతున్న బస్సు గేటు వద్ద నుంచి నేరుగా కిందకు నెట్టివేసింది.

మౌనిక తోసేయడంతో బస్సులో నుంచి కిందపడిపోయిన కండక్టర్ ప్రవళిక అదుపుతప్పి బస్సు వెనుక టైర్ల కింద పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ప్రవళిక రెండు కాళ్లు తీవ్రంగా విరిగిపోయి, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే తోటి సిబ్బంది, స్థానికులు స్పందించి క్షతగాత్రురాలైన ప్రవళికను మెరుగైన చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న ప్రవళిక చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించింది. విధి నిర్వహణలో ఉన్న మహిళా కండక్టర్ పట్ల ప్రయాణికురాలు ఇలా రాక్షసంగా ప్రవర్తించి ప్రాణం తీయడం పట్ల ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగ సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. నిందితురాలపై కఠినంగా హత్య కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.